మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. అమిత్ షా…..

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చిన ఆయన.. మోదీ ఒకవైపు.. కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న భాజపా జాతీయ మండలి సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ  పేద ప్రజలు, దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తారని షా అన్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కూటమి నేతలు తమ వారసులను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. భాజపాలోనూ ఇదే తరహా విధానం ఉండి ఉంటే ఒక చాయ్‌వాలా కుమారుడు ప్రధాని అయ్యేవాడు కాదని అన్నారు. మోదీని ఓడించేందుకు రాకుమారులంతా ఏకమయ్యారని పరోక్షంగా ప్రతిపక్ష కూటమి పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే రామమందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నిరాకరించిందని ధ్వజమెత్తారు….