టీఆర్ఎస్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.

బేగంపేట నుంచి అమిత్​షా నేరుగా..
సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు.అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్​షా ప్రత్యేక పూజలు చేశారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు…అమ్మవారి దర్శనమనంతరం.. సాంబమూర్తినగర్‌లోని భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి అమిత్‌షా వెళ్లారు. అమిత్‌ షాకు సత్యనారాయణ కుటుంబ సభ్యులు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. అమిత్‌ షాను చూసి వారు ఉబ్బితబ్బిపోయారు. సత్యనారాయణ కుటుంబసభ్యులను అమిత్​షాకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరిచయం చేశారు. కుటుంబసభ్యులను అడిగి మరీ తేనీరు సేవించారు. 15 నిమిషాలు అక్కడే గడిపిన అమిత్‌ షా సత్యనారాయతో పాటు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు…

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడులో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగసభలో రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి భుజం తట్టి అమిత్ షా అభినందించారు. అనంతరం ఇద్దరూ చేతులు పట్టుకుని పైకి ఎత్తారు.

మునుగోడు వేదికపై కేసీఆర్‌ విసిరిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు కానీ… తెలంగాణ ప్రజలకు మాత్రం వేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఉద్యమం సమయంలో, ఎన్నికల మేనిఫెస్టో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తూ సాగింది అమిత్‌షా ప్రసంగం. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న అమిత్‌షా… రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ అవినీతి సర్కారు మాయమైపోతదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన మునుగోడు సమరభేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సర్థార్ వల్లభాయ్ పటేల్ చొరవతో రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని అన్నారు. తాము గెలిస్తే సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అమిత్ షా మండిపడ్డారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ఆ హామీ అమలు చేయలేదని చెప్పారు.

మునుగోడు సభకు రాష్ట్ర బీజేపీ కీలక నేతలంతా హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ తదితరులు స్టేజ్ పై ఆశీనులయ్యారు. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించారు…

సభలో ఈటల రాజేంద్ర మాట్లాడుతూ..

మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పదవి వదులుకున్న ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఉప ఎన్నిక వస్తే మునుగోడులో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తదని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడగొట్టాలని ఈటల పిలుపునిచ్చారు…

ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ..

సీపీఐ, సీపీఎంలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వెంట ఉంటాయన్నారు. మునుగోడులో బీజేపీ సభ జరగకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేశారని రఘునందన్ చెప్పారు. ఆదివారం సెలవని.. ప్రభుత్వ కార్యక్రమాలు ఉండవని.. తమ సభకు ప్రజలను రానివ్వకుండా ఉండేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారని రఘునందన్ ఆరోపించారు..

ఎంపీ అరవింద్ మాట్లడుతూ..

దేశంలోనే అందరి కంటే పెద్ద అబద్ధాలకోరు సీఎం కేసీఆర్ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివారం మునుగోడు సమరభేరీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మంచి చేస్తాడని భావించి ప్రజలు అధికారం ఇస్తే… రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. దేశంలో మిగతా సీఎంల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న కేసీఆర్… ప్రజల గురించి పని చేయడం మానేసి ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి న్యూక్లియర్ బాంబ్లా కేసీఆర్ తయారయ్యారని అభివర్ణించారు…