ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న అమిత్‌షా

మునుగోడు సభ కోసం రాష్ట్రానికి వస్తున్న అమిత్‌షా షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు జరిగాయి. ముందుగా ప్రకటించిన సమయం కంటే ముందే హైదరాబాద్‌ చేరుకోనున్నారు. *ప్రత్యేక విమానంలో ఆయన మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.* వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్ల నుంచి వచ్చే భాజపా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ సభామూర్తినగర్‌లో పార్టీ దళిత కార్యకర్త ఎన్‌.సత్యనారాయణను కలుసుకొని అరగంట పాటు గడుపుతారు. సత్యనారాయణ గత మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పార్టీ కోసం పనిచేస్తున్నారని భాజపా సికింద్రాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ తెలిపారు.అమిత్‌షా మధ్యాహ్నం 3.20కి రమదా మనోహర్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు రైతు నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి *ప్రత్యేక హెలికాప్టర్‌లో 4.30 గంటలకు మనుగోడు చేరుకుంటారు.* సాయంత్రం 4.40 గంటల నుంచి 4.55 గంటల వరకు సీఆర్‌పీఎఫ్‌ అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాజగోపాల్‌రెడ్డికి అమిత్‌షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. సభ అనంతరం అమిత్‌షా శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో రాత్రి 8 నుంచి 9.00 వరకు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.