డబ్బు చెదలు పట్టి చిత్తు కాగితాల్లా..

కరెన్సీనోట్లు.. చెదలు పట్టి చిత్తు కాగితాల్లా

కృష్ణా జిల్లా మైలవరంలో ఘటన

సొంతింటి నిర్మాణం కోసం కూడబెట్టిన డబ్బు చెదలు పట్టి చిత్తు కాగితాల్లా మారింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పందుల వ్యాపారం చేస్తున్న జమలయ్య తన వద్ద ఉన్న డబ్బును ట్రంకు పెట్టెలో దాచిపెట్టారు. రూ. 10 లక్షలు పోగు చేసిన అనంతరం మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఇలా సుమారు రూ.5 లక్షలు దాచిపెట్టారు. అయితే వ్యాపారం కోసం దాచిపెట్టిన డబ్బు నుంచి రూ.లక్ష తీసుకునేందుకు పెట్టె తెరిచారు. పెట్టె లోపల డబ్బును చూసి జమలయ్య ఒక్కసారిగా బిత్తరపోయారు. ట్రంకు పెట్టెలో ఉన్న సొమ్ముకు చెదలు పట్టి ఉండటంతో కుటుంబసభ్యులు బావురుమన్నారు. కూడబెట్టుకున్న డబ్బు చిత్తు కాగితాల్లాగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్లి ఆరా తీశారు. పోలీసుల ఎదుట బమలయ్య కుటుంబసభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.