కొత్త జంతువు స్థానికులను బెంబేలెత్తిస్తోంది..

ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికే ఏనుగులు,ఎలుగుబంట్లు, పులుల సంచారంతో వణికి పోతుంటే.. తాజాగా ఇప్పుడు ఉద్దానం ప్రాంతంలో మరో కొత్త జంతువు స్థానికులను బెంబేలెత్తిస్తోంది…రాత్రి వేళల్లో గొర్రెలు, మేకలు, పశువుల దూడలపై దాడి చేస్తూ హడలెత్తిస్తోంది. ఈ జంతువు ఆచూకీ కోసం ఇప్పుడు ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసి ఫారెస్ట్ ను జల్లెడ పడుతున్నారు అటవీశాఖ అధికారులు. ఎలుగుబంట్ల దాడులతో గత కొంతకాలంగా బెంబేలెత్తిపోతోన్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత వాసులకు ఇప్పుడు మరొ కొత్త జంతువు హడలెత్తిస్తోంది. చూడటానికి ఒంటిపై పులి చారలతో కనిపిస్తున్న ఈ జంతువు పులి కంటే పొట్టిగా ఉన్నట్లు జంతువును చూసినవారు చెబుతున్నారు. చాలా చురుకుగా ఉంటూ కంటికి కనిపించినట్టే కనిపించి మెరుపు వేగంతో మాయమవుతుందని అంటున్నారు. మందస, సోంపేట మండలాల పరిధిలో గత కొన్ని నెలలుగా సంచరిస్తూ ఉద్దానం గ్రామాల్లో భయాందోళనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా గొర్రెల కాపరులు, పశుపోషకులను హడలెత్తిస్తోంది…రాత్రివేళల్లో గొర్రెలు, మేకలు, పశువు దూడలపై దాడి చేసి చంపేస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుత చారలతో ఉన్న ఈ జంతువు రాత్రి పూట గొర్రెల మందలోకి చొరబడి దాడిచేసి గాయపరచి చంపేస్తోందని లొహరిబంద, ఎల్‌.కొత్తూరు, రట్టి, భేతాళపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లోహరి బంధలోని జీడి తోటలో సంచరిస్తూ స్థానికులకు తారసపడగా జంతువును స్థానికులు మొబైల్ ఫోన్లో ఫోటోలు తీశారు. విషయాన్ని తెలుసుకుని అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఆ జంతువు ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. దీని కోసం ఈస్త్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ సహాయాన్ని సైతం తీసుకుంటున్నారు..గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం గత రెండు వాటర్ బాడీస్ ఉన్న చోట జంతువుల పాదముద్రలను సేకరించే పనిలో పడ్దారు. లోహరి బంద గ్రామాన్ని సందర్శించి సంఘటనలపై ఆరా తీశారు. గ్రామస్తుల మొబైల్ లో చూసిన దానిబట్టి ఆ జంతువును నీటి పిల్లిగా గుర్తించారు అటవీశాఖ అధికారులు…
వాటర్ బాడీస్ సమృద్ధిగా ఉన్నచోట, అడవులు ఎక్కువగా ఉన్న చోట వీటి సంచారం ఉంటుందని చెబుతున్నారు. జంతువు ఆచూకీ కోసం లోహబంద్ సమీపంలో కెమెరా ట్రాప్‌ను ఏర్పాటు చేసారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, అత్యవసరమైతే గుంపుగా వెళ్కాలని, మేకలు, గొర్రెలు, ఆవులు, వాటి దూడలను ఇళ్లకు తీసుకురావాలని, ఆవులను రాత్రిపూట అడవిలో ఉంచవద్దని అధికారులు జాగ్రత్తలు చెబుతున్నారు…అడవులు తగ్గిపోతుండటంతో అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాలపై పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఉమ్మడి విశాఖ,విజయనగరం జిల్లాల పరిధిలో పులులు సంచారం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఏనుగులు, వెలుగుబంట్ల సంచారం పెరుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.