అన్నదాన మహిమ చిన్న కథ…!!!

అన్నదాన మహిమ చిన్న కథ..!!*
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు.
ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది…
యాత్రికులు దారి మధ్యలో రాత్రుళ్లు గ్రామాల్లో బస చేస్తూ వెళ్లేవారు.

ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకో లేకపోయాడు.
చీకటి పడింది, ఏమి చేయాలో తోచలేదు.
అయితే అదృష్టవశాత్తు ఒక కోయవారి ఇల్లు కనబడింది, అక్కడ ఆశ్రయం కోరాడు.

శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు.
తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు.

ఆ అర్ధరాత్రి ఒక పులి శంబరుడుపై అదను చూసి దాడి చేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది.
బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు, కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు, కాశీ చేరాడు… దైవ దర్శనం చేసుకున్నాడు.

ఈ బ్రాహ్మణునికి ఎప్పటి నుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది.
తన ఇష్ట దైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు.

ఆరోజు రాత్రి కాశీ విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు.
అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు.
ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు,
ఎందుకో చెప్పలేదు!!…
బ్రాహ్మణుడు అలాగే చేశాడు!!…
రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు.

చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి..
ఓయీ బ్రాహ్మణా… నన్ను గుర్తుపట్టావా… నేను కోయవాణ్ణి… నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు!!…

మరు క్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది… ఇదీ అన్నదాన మహిమ …
ఏదైనా తెలుసుకొంటే జ్ఞానం – తెలియకపోతే అజ్ఞానం …