`బాహుబలి` సిరీస్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పేరు తెచ్చుకున్న క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి. దాదాపు మూడేళ్ల విరామం తరువాత స్వీటీ నటించిన మూవీ `మిస్ శెట్టి – మిస్టర్‌పొలిశెట్టి`. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సెప్టెంబర్ 7న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న సందర్భంగా హీరోయిన్ అనుష్క ప్రమోషన్స్‌లో పాల్గొంటూ పెళ్లిపై తొలి సారి స్పందించింది.
ఓ ఆంగ్ల మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన స్వీటీ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు తన పెళ్లి గురించి కూడా స్పందించింది. `సినిమాలో నా పాత్ర పేరు అన్విత. ఎంతో సానుభూతిపరురాలు. తన పనులు పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడుతుంది. తను అందరి లాంటి అమ్మాయి కాదు. ఎంతో ప్రత్యేకమైన అమ్మాయి. మంచి కథతో కూడుకున్న సినిమాలో నటించడం సవాలుతో కూడుకున్నది. నా కెరీర్‌లో దేవసేన, జేజమ్మ, భాగమతి లాంటి ఎన్నో ప్రత్యేకమైన పాత్రల్లో నటించాను..ఇప్పడు నటించిన అన్విత పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి రోల్స్ రావాలంటే అదృష్టం ఉండాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు నటన పట్ల ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడీ స్థాయికి వచ్చానంటే దీని వెనుక ఎంతో మంది సహాయం ఉంది. చాలా సినిమాలు చేసినప్పటికీ మొదటి రోజు సెట్‌కు ఎలా వెళ్లానో ఇప్పటికీ అలానే వెళతాను. నా పాత్రకు తగిన న్యాయం చేయగలనా? అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక్కోసారి ఆనందంగా, మరోసారి ఎంతో కఠినంగా అనిపించింది.
ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. సినిమా ప్రపంచంలో ఉన్న వాళ్లు నిరంతరం నేర్చుకునే అవకాశం ఉంటుంది` అన్నారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకముందన్న అనుష్క..పెళ్లికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అయితే సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నారు…