ఏపీలో టీడీపీ బంద్‌.. నేతల నిరసన.. ఉద్రిక్తత వాతావరణం..

R9TELUGUNEWS.COM.

ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీ నేతల దాడికి నిరసనగా టీడీపీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వైసీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి…

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా (అక్టోబర్ 20) ఏపీ వ్యాప్తంగా బంద్ చేయాలని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం దారుణమని, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.మరోవైపు రాజకీయ పార్టీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్య సూచనలు చేశారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రమంతటా అదనపు బలగాలు మోహరించినట్లు ఆయన తెలిపారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు…

ముందస్తు అరెస్టులు..

దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలిస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతో హోరెత్తుతోంది. కనిగిరి బస్టాండులో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే విశాఖ, శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు….ఏపీలో నిరసనల నేపథ్యంలో తెల్లవారు జామునుంచే బస్టాండ్లు, బస్సు డిపోల ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. బంద్ కోసం వస్తున్న టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టిడిపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఛౌదరి బాబ్జీతో పాటు పలువురు టిడిపి నేతలను అరెస్టు చేసి పోలీసులు.