సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని జెడ్పీటీసీకి ఇంఛార్జి పదవి..సీఎం జగన్ సంచల నిర్ణయం..!

2024 ఏపీ శాసనసభ ఎన్నికలకు వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేరుతో పనిలేకుండా, సర్వేలు, సామాజికవర్గాల సమీకరణాలే ప్రాతిపదికన నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమిస్తున్నారు సీఎం జగన్..శుక్రవారం కూడా వైసీపీ నుంచి ఆరో జాబితా రిలీజైంది. ఈ జాబితాలో నాలుగు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జులను వైఎస్ జగన్ నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పొచ్చు..

అదే కారణమా?
ఆరో జాబితాలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వైఎస్ జగన్ షాకిచ్చారు. ఆ నియోజకవర్గానికి ఇంఛార్జిగా స్వర్నాల తిరుపతి యాదవ్‌ను జగన్ నియమించారు. తిరుపతి యాదవ్ ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేను కాదని, జెడ్పీటీసీగా ఉన్న తిరుపతి యాదవ్‌ను మైలవరం వైసీపీ ఇంఛార్జిగా నియమించడం వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సర్వేలతో పాటుగా సామాజిక వర్గ సమీకరణాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ గురించి సర్వేలలో సానుకూల స్పందన రాలేదని సమాచారం. అలాగే వసంతకృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. ఈసారి మైలవరం టికెట్ బీసీలకు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి యాదవ్‌ను ఇంఛార్జిగా నియమించినట్లు తెలిసింది.