ఏపీ ముఖ్యమంత్రి జగన్ బిజేపి పై వ్యాఖ్యలు…

బీజేపీతో ఇంతకాలం వైసీపీకి ఉన్న సయోధ్య ముగిసినట్టే కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఇది నిజమే అనే విధంగా ఉన్నాయి. ఏనాడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడని జగన్… ఈరోజు మాట్లాడుతూ బీజేపీ అండగా లేకపోయినా పర్వాలేదని అన్నారు. పల్నాడు జిల్లా క్రోసూర్ లో జరిగిన జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ… జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని… అయినా పర్వాలేదని అన్నారు. తాను ప్రజలనే నమ్ముకున్నానని… ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే తన బలం అని చెప్పారు.తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల జగన్ పాలనలో అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే తన ప్రసంగంలో అమిత్ షా, నడ్డాల పేర్లను జగన్ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.