నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది జగన్ సర్కారు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కొవిడ్ ఆంక్షలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది జగన్ సర్కారు. ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి జీవో మంగళవారం విడుదల చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అలాగే ఏపీలో కరోనా ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి.

కరోనా ఆంక్షలు

ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అలాగే షాపింగ్ మాల్స్‌ తదితర వాటిల్లో కోవిడ్‌ నిబంధనలు పాటించకపోతే 10 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు.. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్‌‌లలో అయితే 100 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా 50 శాతం కెపాసిటీతో థియేటర్లను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకులకు మాస్క్‌ తప్పనిసరి చేయాలని ఏపీ సర్కార్ పేర్కొంది.