ఆంధ్రకు మరికొద్ది రోజుల్లో వర్ష సూచన..!!

ఆధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో 4వ తేదీన తుపాను ఆవర్తనం ఏర్పడుతుందని, 5న ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ అధికారులు తెలిపారు…ఇది మరింత బలం పుంజుకుని వాయుగుండంగా మారుతుందని చెప్పారు. 8న తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. దీంతో ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని చెప్పారు.

ఈ సీజన్‌లోని బలమైన తుఫాన్ డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అయితే, అది బలహీనపడుతుందా.? లేక బలపడుతుందా? అన్నది చూడాలని వాతావరణ అధికారులు అన్నారు. ఆ తుపాను ముప్పు ఏపీకి పొంచి ఉన్నదా అనేది విశ్లేషణ చేస్తున్నామని వివరించారు.

ఈ వాతావరణ పరిస్థితుల నడుమ దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.

దక్షిణాంధ్రకు వర్ష సూచన – ఏపీ వెదర్ మ్యాన్
”కోనసీమ జిల్లా, ఉభయగోదావరి, క్రిష్ణా, గుంటూరు జిల్లాలో కొన్ని భాగాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది. 3. 4 తేదీల్లో దక్షిణ ఆంధ్ర అయిన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈసారి భారీ వర్షాలు ఉండే అవకాశం లేదు. రాబోయే ఉపరితలం చాలా దిగువ స్థాయిలో ఉంటుంది కాబట్టి, మనకు వర్షాలు తక్కువ ఉంటాయి. తమిళనాడుకు అధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది” అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు..