40మంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది….

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న 40మంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అయితే తొమ్మిదిమంది బాలికల పరిస్థితి ఆందోళనకరంగా వుండటంతో వారిని గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. …

గుడివాడ మండలంలోని మోటూరులోని బీఆర్ అంబేద్కర్ బాలికోన్నత గురుకుల పాఠశాలలో గురువారం సాయంత్రం క్రీడలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 6,7, 8 తరగతుల విద్యార్థునులకు 800మీటర్ల పరుగుపందెం పెట్టారు. ఈ పరుగుపందెంలో పాల్గొన్న దాదాపు 40మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయి గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయారు. పాఠశాల సిబ్బంది అప్రమత్తమై విద్యార్థినులను మోటూరు పీహెచ్‌సీ కి తరలించారు.అక్కడే చాలామంది బాలికలు కోలుకున్నారు. అప్పటికే తమ పిల్లలు అస్వస్థతకు గురయినట్లు తెలియడంతో కంగారుపడుతూ పాఠశాలకు, అక్కడినుండి పీహెచ్‌సీ వద్దకు తల్లిదండ్రులు వచ్చారు. దీంతో కోలుకున్న బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే ఓ తొమ్మిదిమంది విద్యార్థునుల పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా వుండటంతో గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారికి కూడా మెరుగైన చికిత్స అందించడంతో కోలుకున్నట్లు… ప్రస్తుతానికి ఎవ్వరికీ ఎలాంటి అపాయం లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.డీహైడ్రేషన్ కారణంగానే విద్యార్థినుల అస్వస్థతకు గురయినట్లు గుడివాడ ప్రభుత్వాస్పత్రి డాక్టర్ జయశ్రీ తెలిపారు. కొందరు విద్యార్థినులు ఎక్కువగా భయపడిపోవడంతో ఆక్సిజన్ సమస్య ఏర్పడిందని… వారికి మెరుగైన చికిత్స అందించడంతో కోలుకున్నారని డాక్టర్ వెల్లడించారు. విద్యార్థినుల అస్వస్థతపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సాయంత్రం పెట్టిన ఆహారం కారణంగానే తమ పిల్లలకు అస్వస్థతకు గురయ్యారని బాలికల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేవలం పరుగెత్తడం వల్లే విద్యార్థినులు ఇలా అస్వస్థతకు గురయ్యారా లేక వారి తల్లిదండ్రులు అనుమానిస్తున్నట్లు ఆహార పదార్థాలు కారణమా అన్నది తెలుసుకునేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టారు. ఆర్డీఓ పద్మావతి ఆదేశాల మేరకు ఈ సంఘటనకు గల కారణాలపై తాముకూడా విచారణ జరుపుతున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు వెల్లడించారు. విచారణ చేస్తామన్నారు.