మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ మార్పుపై ఏపీ టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..!

హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ మార్పుపై ఏపీ టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మూడు నెలలకే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చూస్తుంటే బాధేస్తుందని ఆదేవన చెందారు. మూడు నెలలు కూడా ప్రతిపక్ష పార్టీలో బొంతు రామ్మోహన్ ఉండలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అసలు ఏంటీ రాజకీయం అని మండిపడ్డారు. హైదరాబాద్‌ లాంటి మహా నగరానికి ఆయన్ను బీఆర్ఎస్ పార్టీ మేయర్‌ను చేసి గౌరవించిందని అన్నారు. అలాంటి పార్టీని వీడాలని ఆయనకు ఎలా అనిపించిందని ప్రశ్నించారు.
ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుత రాజకీయాల్లో మనం ఇమడగలమా? అని అనిపించిందని తెలిపారు. తనకు చంద్రబాబు కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు తప్ప మరే వ్యక్తి తెలియదని అన్నారు. చివరి వరకు టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. కాగా, మాజీ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. రక్తంతో గోడపై ”సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే” అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు..