ఏపీకి పొంచి తుపాను ముప్పు..!!దీని ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు…సిత్రాంగ్ తుపానుగా నామకరణం!..!

విశాఖకు మరో సూపర్ సైక్లోన్ ప్రమాదం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ తరువాత భారీ తుపాన్ ఏపీ వైపు దూసుకొచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 18న అండమాన్ వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది 20వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతంగా విస్తరించనుంది…..ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్​ దిశగా పయనించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అది తుపానుగా, పెను తుపానుగా మారే చాన్సెస్​ ఎక్కువున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ వాయుగుండం తుపానుగా మారితే దీన్ని ‘సిత్రాంగ్’ అని పిలుస్తారని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలపై కూడా అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ‘సిత్రాంగ్’ అనే పేరును థాయ్ లాండ్ సూచించింది. థాయ్ భాషలో ‘సిత్రాంగ్’ అంటే ‘వదలనిది’ అని అర్థం. అయితే.. ఈ సిత్రాంగ్​ తుపానుపై నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​ (NDRF) బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు ట్విట్టర్​ ద్వారా తెలుస్తోంది. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని మెస్సేజ్​ కూడా అందింది..

భౌగోళికంగా విశాఖ సముద్రతీరంలోని ఒక వంపు లాంటి ప్రాంతం వద్ద నగరం నిర్మితమై ఉండడం, డాల్ఫీన్ నోస్ లాంటి సహజసిద్దమైన కొండలు తుపానులను విశాఖ వద్ద తీరం దాటకుండా సహజ రక్షణ కల్పించేవి. అయితే కొన్నేళ్లుగా వాతావరణంలో జరుగుతున్న మార్పులు , ప్రకృతిని అభివృద్ధి పేరుతో చేస్తున్న నష్టం వల్ల విశాఖ తీరంపై ప్రభావం పడుతుంది. ఎనిమిదేళ్ల క్రితం హుద్ హుద్ తుపాను సృష్టించిన విలయం ఇంకా వైజాగ్ వాసులకు పీడకల గానే ఉంది. ఆ తరువాత నుంచి తుుపాను అంటేనే వైజాగ్ వాసులకు గుండె దడ పట్టుకుంటుంది. మరో సూపర్ సైక్లోన్ త్వరలో ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అందించిన అంచనాలతో మళ్లీ అందరి దృష్టి వైజాగ్ పై పడింది. అయితే ఈ తుపాను వల్ల వైజాగ్ మాత్రమే కాకుండా ఏపీలోని ఇతర జిల్లాలు, ప్రాంతాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం మరో రెండు రోజులు పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది….