గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారు..వారిని మోదీనే ఆడిస్తున్నారు : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..
తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఖమ్మం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను పెద్దన్నగా సంబోధించారు. ఇవాళ రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని ప్రశంసించారు. కంటి పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయం, ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తాం అని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. అదేవిధంగా సమీకృత కలెక్టరేట్లను నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్ తెలిపారు..మేం ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం. ఢిల్లీ మొహల్లా క్లినిక్ మంచి ఫలితాన్నిస్తోంది. వాటిని చూసే సీఎం కేసీఆర్ ఇక్కడ బస్తీ దవాఖానాగా అమలు చేశారు. మొహల్లా క్లినిక్ల పరిశీలనకు కేసీఆర్ ఢిల్లీ గల్లీలో తిరిగారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ పాఠశాలలు పరిశీలించారు. తమిళనాడులోనూ పాఠశాలలు బాగు చేసుకున్నారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. కేరళలో విద్య, వైద్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి విన్నా. అలాంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు..? బీజేపీ నియమించిన గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారు. సీఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గవర్నర్లను మోదీనే ఆడిస్తున్నారు. గవర్నర్లకు ఢిల్లీ నుంచి ఒత్తిడి ఉంది. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే గవర్నర్ల పని అన్నట్లుగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్ దూసుకెళ్తోంది. మనమేం పాపం చేసుకున్నామని వెనుకబడిపోతున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది. 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బీజేపీని తరిమికొట్టాలి’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు…
‘సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారు’ కేంద్రంపై ఆప్ ముఖ్యమంత్రుల ఫైర్..
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్బావ బహిరంగ సభలో దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. గవర్నర్లను మోదీ ఆడిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొన్ని రాష్ట్రాల్లో కొనుగోళ్లతో అధికారం దక్కించుకునే కుట్ర జరుగుతుందని భగవంత్ మాన్ మండిపడ్డారు.’సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారు’ కేంద్రంపై ఆప్ ముఖ్యమంత్రుల ఫైర్..
కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు. సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా ఉందని, ఏవైనా ప్రత్యేక కండ్ల అద్దాలు తయారు చేసి ఉంటే, ఇంత జనాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని అంటూ భగవంత్ అన్నారు. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని ఆయన బీజేపీపై విమర్శలు చేశారు….