నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ శాసనసభకు సమర్పించనున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు..

నేడు అసెంబ్లీలో బడ్జెట్‌

నేడు అసెంబ్లీలో బడ్జెట్‌
శాసనసభకు సమర్పించనున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
గత వార్షిక బడ్జెట్‌ కంటే 15%-20% వరకు అధికం!
గత 4 నెలలుగా గణనీయంగా పెరిగిన రాష్ట్ర రాబడులు
వచ్చే ఏడాది 1.10 లక్షల కోట్ల పైనే!
తెలంగాణకు అన్నీ సానుకూలతలే
ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
శాసనమండలిలో చదువనున్న మంత్రి వేముల

కరోనా విధ్వంసం నుంచి తేరుకొని ఆర్థికపరంగా మళ్లీ పరుగులు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. సకల జనుల సంక్షేమాన్ని, దళితుల సాధికారతను కాంక్షించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలిసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం రాత్రి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో మంత్రివర్గం బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం ఉదయం 11.30గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రతిపాదనలను చదువుతారు. గతేడాది కంటే ఈ సారి బడ్జెట్‌ 15 నుంచి 20శాతం వరకు అధికంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో వచ్చే ఆర్థికసంవత్సరంలో రూ.1.10 లక్షల కోట్ల వరకు సొంత రాబడులు ఉండవచ్చని అం చనా. పన్ను, పన్నేతర, కేంద్ర పన్నుల వాటా కలిపి రెవెన్యూ రాబడి రూ.1.60 లక్షల కోట్లు దాటవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎన్నారైల సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు
సీఎం కేసీఆర్‌కు మహేశ్‌ బిగాల వినతి
రాష్ట్ర బడ్జెట్‌లో ఎన్నారైల సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు చేయాలని సీఎం కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల విజ్ఞప్తిచేశారు. బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, ఎన్నారైలకు కూడా సముచితంగా కేటాయింపు చేసి మేలు జరిగేలా చూడాలాని కోరారు.