అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం…!

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పదినిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు.

కాగా అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి అర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న లేని లోటు తీర్చలేనిదన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని అన్నారు.

సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు.