కేజ్రీవాల్ పై అసోం ముఖ్యమంత్రి శర్మ మరోసారి విమర్శలు.. ఢిల్లీనీ లండన్, ప్యారిస్ చేస్తా అన్నావు ఏమైంది..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న ట్వీట్ల పోరు ఆగలేదు. తాజాగా ఆదివారం అసోం ముఖ్యమంత్రి శర్మ మరోసారి కేజ్రీవాల్ ను ఎండగట్టే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గా కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను గుర్తు చేసి నిలదీశారు. ఢిల్లీని లండన్, ప్యారిస్ మాదిరిగా అభివృద్ధి చేస్తానన్న హామీతో మీరు అధికారంలోకి వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఇది మీకు గుర్తు లేదా..? చెప్పింది ఏమీ చేయకపోగా అసోం, ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న పట్టణాలతో ఢిల్లీని పోల్చి చూపించడం మొదలు పెట్టారు. నన్ను నమ్మండి. ఒకవేళ ఢిల్లీ మాదిరి పట్టణం, వనరులు బీజేపీ చేతికి వస్తే (పాలనా పగ్గాలు) ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న పట్టణంగా అభివృద్ధి చేస్తుంది’’అంటూ అసోం ముఖ్యమంత్రి హిందీలో ట్వీట్ చేశారు.

కానీ, కేజ్రీవాల్ దీనికి తెలివిగా సమాధానం ఇచ్చారు. లండన్ హామీ గురించి మాట్లాడకుండా వేరే అంశాన్ని ఎత్తారు. ‘‘మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. మీ ప్రభుత్వ స్కూల్ ను చూసేందుకు నన్ను ఎప్పుడు రమ్మంటారు? పాఠశాల మంచిగా లేకపోయినా ఫర్వాలేదు. కలసి పరిష్కరిద్దాం’’అంటూ కేజ్రీవాల్ రిప్లయ్ ఇచ్చారు.

అసోం ప్రభుత్వం ఇటీవల పదో తరగతి పరీక్షల్లో సున్నా ఫలితాలు సాధించిన కొన్ని స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది. దీన్ని తప్పుబడుతూ కేజ్రీవాల్ స్పందించారు. మూసివేత పరిష్కారం కాదని, మరిన్ని తెరవాలంటూ సూచన చేశారు. దీనికి హిమంత బిశ్వ శర్మ గట్టిగా స్పందించడంతో ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. తాను విద్యా మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 8,610 పాఠశాలలు ప్రారంభించినట్టు గుర్తు చేస్తూ.. ఎప్పటి మాదిరే మీరు తగినవిధంగా అధ్యయనం చేయకుండా మాట్లాడారంటూ విమర్శించారు.