అట్లతద్ది నోము కథ..!!

అట్లతద్ది నోము కథ

నేడు అట్లతద్ది పండుగ సందర్భంగా…

అట్లతద్దోయ్ ఆరట్లోయ్! ముద్దపప్పోయ్ మూడట్లోయ్! చిప్పచిప్ప గోళ్లు, సింగరయ్య గోళ్లు! మా తాత గోళ్లు, మందాన రాళ్లు! అంటూ ఆడపిల్లలు ఆడిపాడే పండుగ అట్లతద్ది. పౌరాణికంగా ‘చంద్రోదయ ఉమావ్రతం’ అంటారు. తొలినాడు పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి పార్వతీదేవీ ఈ నోము నోచిందని చెబుతారు. ఉత్తరాదిన పెద్ద పండుగ అయిన కార్వా చౌత్ తో సమానమైన తెలుగువారి పండుగ అట్లతద్ది విశేషాలు…

అచ్చతెలుగుదనం ఉట్టిపడేలా పట్టు పావడాలు కట్టిన పల్లె పడుచులు. తమ ఆశలు ప్రతిఫలించేలా, నవవధువులు ముత్తైదు భాగ్యాలు సిద్ధించేలా, కరచరణాలకు నఖరంజని ధరిస్తారు. ఆనందమనే ఆకాశపుటంచులు తాకి హాస్యరస భరిత సంభాషణలతో, ఆటపాటలతో నేలపై వెన్నెల పరుస్తారు. తెలుగు లోగిళ్లకు, తోటలకు సరికొత్త అందాలు తెస్తారు. ఆధ్యాత్మిక శోభకు పట్టం కడతారు. కన్నెలు, నవవధువులు చేసే సరదాల సందళ్లు చూసే కన్నులు వెలుగులై, మనసు ముగ్ధమయ్యే కమనీయ రమణీయ పర్వం అట్లతద్ది.

అట్లతద్ది ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి వెళ్లిన మూడో రోజు వస్తుంది. పెళ్లైన స్త్రీలు ఐదవతనం కోసం, కన్నె పిల్లలు మంచి భర్త కోసం నోము నోచుకోవడం ఆనవాయితీగా కనిపిస్తుంది. అట్లతద్ది రోజున తెల్లవారు జామునే లేచి, స్నానాలు చేసి చద్దిభోజనం చేస్తారు. పగలంతా భోజనం చేయరు. పగలంతా తోటలవెంట చెలులతో ఆట పాటలతో గడిపి సాయంవేళకు ఇళ్లకు చేరుకుంటారు. పొద్దువాలిన తరువాత పదకొండు మంది ముత్తెదువులను ఆహ్వానిస్తారు. కలశం ప్రతిష్టించి గౌరీదేవిని పూజగదిలో ఆవాహన చేసి పూజిస్తారు. పూజలో తులసీదళం, తమలపాకులు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఆ ఆకులతో 11 ముళ్లు వేసి చేతులకు తోరాలు కట్టుకుంటారు. పూజలో లలితా సహస్ర నామం, గౌరీఅష్టోత్తరం పఠిస్తారు. అనంతరం అట్లతద్ది కథ చదువుకుంటారు. కథ పూర్తైన తర్వాత అమ్మవారికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తెదువులకు ఒకొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, గౌరీ దేవికి నివేదించిన కుడుముల్లో నుంచి ఒకటి ఉంచిన తాంబూలంతో వాయనం ఇస్తారు. ఆ తర్వాత చంద్రుణ్ణి దర్శించుకుంటారు. తరువాత అట్లు ఆరగించి ఉపవాసం విరమిస్తారు.

అట్లతద్ది నోము కథ :

అట్ల తద్ది నోము నోచుకునే వారు చివరిలో ఈ కథ చదువుకుంటారు:

పూర్వం ఒక రాజ్యంలో రాజు, మంత్రి, సేనాపతి, పురోహితుడు నలుగురికీ నలుగురు కూతుళ్లు ఉండేవారు. వాళ్లు నలుగురూ ఎంతో స్నేహంగా వుండేవారు. ఒకనాడు వాళ్లందరూ అట్లతద్ది పూజకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందరూ ఉపవాసం ఉన్నారు. కానీ రాజుగారి కూతురు మాత్రం ఆకలితో నీరసించిపోతుంది. ఆమె సోదరుడైన రాజకుమారుడు. చెల్లి అవస్థను చూడలేక, అద్దంలో ఒక తెల్లని వస్తువును చూపించి…. చంద్రోదయమైందని చెప్పాడు. రాజకుమార్తె అన్న మాటలు నమ్మింది. చంద్రోదయం కాకుండానే ఫలాహారం. తిని, పూజచేసింది. కొన్నాళ్ల తరువాత స్నేహితురాళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అందరికీ చక్కని భర్తలు లభించారు.

కానీ రాజకుమార్తెకు మాత్రం వచ్చిన సంబంధాలు అన్నీ వెనక్కు వెళ్లగా.. చివరకు ఒక ముసలివాడు భర్తగా లభిస్తాడు. దాంతో ఆ రాకుమార్తె ఎంతగానో దుఃఖిస్తుంది. పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధిస్తుంది. ఆమె బాధను చూసిన పార్వతీపరమేశ్వరులు ఆమె ముందు ప్రత్యక్షమై… ఆశ్వయుజ బహుళ తదియనాడు మళ్లీ నియమ నిష్టలతో అట్లతద్ది నోము నోస్తే నీ భర్త యవ్వనవంతుడు అవుతాడు అని ఆశీర్వదించి వెళ్లిపోతారు. వారు చెప్పిన విధంగానే రాకుమార్తె నోము నోచి, పూజాక్షతలను భర్త చేతికి ఇచ్చి నమస్కరిస్తుంది. ఆమె పైకి లేచి చూసేసరికి ముసలి భర్త పడుచు వాడిగా మారిపోయి ఉంటాడు