అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి!..

ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది. అంత్యక్రియల నిమిత్తం శనివారం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం రాయల్‌ బ్రిస్బేన్‌ ఉమెన్స్‌ ఆసుపత్రిలో ఆమె పని చేస్తుంది. మార్చి 2న సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల.. ప్రమాద వశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఉజ్వల మరణించడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఉజ్వల తల్లిదండ్రులైన వేమూరు వెంకటేశ్వరరావు, మైథిలి కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు..