అయోధ్య వెళ్లినందుకు ముస్లిం మతగురువుకు బెదిరింపులు !..

ఈ నెల 22న అయోధ్య రామమందిరంలో జరిగిన బలరాముడి (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ(Imam Umer Ahmed Ilyasi) ఆరోపించారు. అయోధ్యలో రామమందిరం కార్యక్రమానికి హాజరైనప్పటి నుంచి తనకు అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఇమామ్ వెల్లడించారు. రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్స్ చేసి, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అయితే దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కార్యక్రమానికి తాను వెళ్లానని… ఎట్టి పరిస్థితుల్లోనూ వారి బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు..ఉమర్ అహ్మద్ ఇలియాసీ మాట్లాడుతూ… “శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి నాకు ఆహ్వానం అందింది. రెండు రోజులు ఆలోచించి, దేశం, సామరస్యం కోసం అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇలా చేసినందుకు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఫత్వా జారీ చేశారు” అని ఇలియాసీ పేర్కొన్నారు. వివాదాలు చుట్టుముట్టినప్పటికీ తన సంఘం నుంచి ఎదురవుతున్న పరిస్థితులకు అధైర్యపడకుండా ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడంలో నిబద్ధతతో ఉన్నానని ఇలియాసీ పేర్కొన్నారు. దీనితో ఇలియాసీ నిర్ణయం పట్ల నెటిజన్లు, ప్రజాస్వామ్య వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 22న అయోధ్య రామమందిరంలో జరిగిన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు..