అయోధ్యలో పోటెత్తిన భక్తజనం..11 రోజుల వ్యవధిలో సుమారు 25 లక్షలమంది భక్తు లు స్వామీ వారి దర్శనం..

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Temple) భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. దేశం నలుమూలల నుండి వస్తున్న భక్తులతో అయోధ్య భక్త జనసంద్రంగా మారుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా బలరాముడి (రామ్ లల్లా) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాక… గత 11 రోజుల వ్యవధిలో సుమారు 25 లక్షలమంది భక్తులు బాలరాముణ్ని దర్శించుకొన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు అందినట్లు రామ మందిరం ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఇందులో హుండీ ద్వారా రూ. 8 కోట్లు నగదు రాగా, రూ. 3.5 కోట్లు చెక్కుల రూపంలో, ఆన్ లైన్ రూపంలో విరాళాలు వచ్చినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేసారు. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని ఆలయ ట్రస్టు ఆఫీస్‌ ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ గుప్తా తెలిపారు..బలరాముడ్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీను దృష్టిలో ఉంచుకుని దర్శనం సమయాలను కూడా ఆలయ అధికారులు పొండిగించారు. బలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మొదటి రెండు మూడు రోజులు రోజూ ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు మధ్యలో రెండు గంటల పాటు విరామం ఇచ్చిన దర్శనాలకు అనుమతించేవారు. అయితే భక్తుల రద్దీను దృష్టిలో పెట్టుకుని ఆ సమయాలను ఉదయం 6 గంటల నుండి రాత్ర 10 గంటల వరకు పొడించారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు హారతి, భోగ్‌ కోసం 15 నిమిషాలు మాత్రం భక్తుల దర్శనాలు నిలిపివేస్తారు.

ఈ నెల 22న అయోధ్య రామమందిరంలో జరిగిన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. సుమారు 500 సంవత్సరాల హిందువుల కోరికగా ఉన్న రామ మందిర నిర్మాణం చట్టం, న్యాయస్థానం అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు పూర్తయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీనితో దేశ విదేశాల నుండి భక్తులు అయోధ్యకు పొటెత్తున్నారు..