అయోధ్యలో ప్రసాదం కోసం 7000 కిలోల హల్వా.

అయోధ్యలోని అద్భుతమైన రామమందిరాన్ని జనవరి 22న ప్రారంభించనున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి…మరికొద్ది రోజుల్లో రామ్‌ లల్లా దర్శన భాగ్యం భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ తారలు, క్రికెట్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రసాదం సిద్ధం చేయడం వెనుక ఎవరి హస్తం ఉందోనని భక్తుల్లో ఆసక్తి నెలకొంది. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసాదం కోసం 7000 కిలోల హల్వాను తయారుచేస్తారు. నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్‌ విష్ణు మనోహర్ భారీ మొత్తంలో ఈ హల్వాను తయారు చేసే బాధ్యతను తీసుకున్నారు. లక్షమంది రామ భక్తుల కోసం రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఇంత పెద్ద పరిమాణంలో తయారు చేస్తున్న హల్వా కోసం నాగ్‌పూర్ నుండి ఒక కడాయిని కూడా తెప్పించారు. సుమారు 1400 కిలోల బరువున్న ఈ కడాయిలోనే రాముల వారి ప్రసాదాన్ని తయారుచేస్తారు. విష్ణువు ఆ ప్రసాదానికి ‘రామ్ హలువా’ అనే పేరు కూడా పెట్టారు…ఈ హల్వా తయారీకి 900 కిలోల సెమ్యా, 1000 కిలోల పంచదార, 2500 లీటర్ల పాలు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 1000 కిలోల నెయ్యి, 2500 లీటర్ల నీటిని ఉపయోగిస్తారు. ఈ పదార్థాలన్నీ మిక్స్ చేసి హల్వా తయారు చేయడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ఇకపోతే, రామ భక్తుల కోసం ప్రసాదం సిద్ధం చేస్తున్న విష్ణు మనోహర్ అద్భుతమైన మిఠాయి వ్యాపారి. ఇప్పటి వరకు 12 ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చివరిసారిగా 285 నిమిషాల్లో అన్నం సహా 75 రకాల వంటకాలు సిద్ధం చేశారు. అతను స్పెషల్‌ కుక్కింగ్‌ క్లాసులకు వెళ్తుంటారు..ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటారు. ఈయనే అయోధ్య రామమందిర ప్రారంభంరోజు భక్తులందరికీ ప్రసాదం తయారు చేస్తున్నారు.