‘బేబీ’ తెలుగు మూవీ రివ్యూ.baby-movie-review

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: ఎం.ఎన్.బాల్ రెడ్డి

నిర్మాత: ఎస్కేఎన్

రచన-దర్శకత్వం: సాయిరాజేష్

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులతో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘బేబీ’baby-movie-review తన చార్ట్‌బస్టర్ పాటలు, ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో క్రేజీ ఫిల్మ్‌గా ఎదిగింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ రచన మరియు దర్శకత్వం వహించగా, SKN ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బేబీ’ సినిమా ఈరోజు జూలై 14న థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉందో చూద్దాం.

ఈ మధ్య కాలంలో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు లేకపోయినా.. ఇంట్రెస్టింగ్ ప్రోమోలు.. మంచి పాటలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా ‘బేబి’. వైష్ణవి చైతన్య.. ఆనంద్ దేవరకొండ.. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ‘హృదయ కాలేయం’ దర్శకుడు.. ‘కలర్ ఫొటో’ కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వైష్ణవి (వైష్ణవి చైతన్య) స్కూల్ రోజుల్లో తన క్లాస్ మేట్ అయిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను చూసి ప్రేమలో పడుతుంది. ముందు ఆ అమ్మాయిని పట్టించుకోని ఆనంద్.. తర్వాత ఆమె తన మీద చూపించే ప్రేమకు లొంగిపోతాడు. ఆనంద్ పదో తరగతి ఫెయిలై ఆటో డ్రైవర్ గా మారితే.. వైష్ణవి మాత్రం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చేరుతుంది. ఇంజినీరింగ్ మొదలు పెట్టే ముందు ఆనంద్ కు ఎక్కడ దూరం అయిపోతానేమో అని బాధ పడుతూ కాలేజీలో అడుగు పెట్టిన ఆమె.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నెమ్మదిగా మారిపోతుంది. తన వేషం సహా వ్యవహారం మార్చేయడంతో పాటు తనను ఇష్టపడే విరాజ్ (విరాజ్ అశ్విన్) పట్ల ఆకర్షితురాలు అవుతుంది. వైష్ణవి ప్రవర్తన నచ్చక ఆమె పట్ల ఆనంద్ దురుసుగా ప్రవర్తిస్తాడు. దీంతో వైష్ణవి అతడికి మరింత దూరమై విరాజ్ కు ఇంకా దగ్గరవుతుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి అన్నది మిగతా కథ..
మందుకి బానిసైపోయిన ఆనంద్ తన గతాన్ని గుర్తు చేసుకోవడంతో కథ మొదలౌతుంది. స్కూల్ లో ఆనంద్, వైష్ణవి ల పరిచయం, ప్రేమ ఇవన్నీ మాంటేజస్ గా చకచకగా తీసుకెళ్ళారు. ఆనంద్, వైష్ణవి ల మధ్య ప్రేమ పుట్టడం కూడా ఆ వయసుకు తగ్గట్టే వుంటుంది. క్లాస్ లో అమ్మాయిలందరూ అబ్బాయిలకి రాఖీలు కట్టాలని ఆర్డర్ వేస్తాడు మాస్టర్. వైష్ణవి దెబ్బలు తింటుంది కానీ ఆనంద్ కి రాఖీ కట్టదు. కందిపోయిన వైష్ణవి చేయి చూసి ‘నన్ను కూడా ప్రేమించనివ్వు’ అంటాడు ఆనంద్. ఆ వయసులో ప్రేమ పుట్టాడానికి ఇంతకంటే పెద్ద కారణం అక్కర్లేదు.( పెన్సిల్ చెక్కడానికి షార్ఫ్ నర్ ఇవ్వగానే పుట్టేసే ప్రేమలు క్లాస్ రూమ్ అనుభవంలో వున్నవే). ఆనంద్ టెన్త్ ఫెయిల్ కావడం, వైష్ణవి ఇంజనీరింగ్ లో అడుగుపెట్టడం వరకూ.. స్లో మాంటేజులతో ఓ రెండు మేఘాలు పాటని నేపధ్య సంగీతంగా వాడి ఇద్దరి ప్రేమలోని కొన్ని మూమెంట్స్ ని అలా చూపించుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఐతే వైష్ణవి ఒక్కసారిగా కాలేజీలోఅడుగుపెట్టిన తర్వాత ఇది ఒక రొటీన్ ఫార్ములా ట్రాక్ లో నడుస్తుంది. విరాజ్ పాత్ర ఎంటర్ కావడం, వైష్ణవి పాష్ గా మారడం, కొత్త స్నేహాలు, అలవాట్లు ఇవన్నీ రొటీన్ గా వుంటాయి. ఐతే వైష్ణవి వేషధారణ విషయంలో ఆనంద్ అభ్యంతరం చెప్పే సన్నివేశం, తర్వాత వచ్చిన విరామం ఘట్టం .. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కుర్రాళ్ల‌కు నచ్చేస్తుంది. ఆ సీన్ త‌ర‌వాత‌… ఓ మంచి సినిమా చూస్తున్నాం.. అనే ఫీల్ తో విరామం తీసుకొంటాడు ప్రేక్ష‌కుడు. ఐతే సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి బేబీలో అసలు సమస్య మొదలౌతుంది. ఈ ప్రేమకథలో చెప్పడానికి కొత్త అంశం, కోణం అంటూ ఏదీ వుండదు. ఇక్కడ నుంచి ప్రీక్లైమాక్స్ వరకూ వచ్చే సీన్లు ప్రేక్ష‌కుల్లో అంత‌గా ఇంపాక్ట్ క‌లిగించ‌వు. కొన్ని సీన్లు.. బాగా మొద‌లెట్టినా, సుదీర్ఘంగా సాగే స‌రికి.. అవి తేలిపోయాయి. అవి కూడా ఇప్పటి యువత మైండ్ సెట్ కి అద్దం పట్టేలా ఏం వుండవు. దీనికి కారణం ఈ కథని ముందుకు నడిపిస్తున్న వైష్ణవి పాత్రని క్లారిటీ లేకుండా తీర్చిదిద్దాడు దర్శకుడు. ‘ఆది’ సినిమాలో ఎల్బీ శ్రీరాం పాపులర్ డైలాగ్ డిక్షన్ లో.. ఒకసారి ప్రేమిస్తానని చెబుతుంది, మరోసారి లేదని అంటుంది. నువ్వుంటే ఇష్టం అంటుంది. మరొకరితో వుంటానంటుంది. ఏం అర్ధం కాకుండా బిహేవ్ చేస్తుంది’’ ఈ టైపులో వుంటుంది ఆ క్యారెక్టర్. నిజానికి ఇదొక టీనేజ్ క్యారెక్టర్ అనుకుందాం. ఆ వయసులో అన్ని తెలివితేటలు వుండవనే భావిద్దాం. కానీ ఆ పాత్ర ప్రవర్తించే తీరు అలా వుండదు. ఒకొక్కసారి ప్రేమలో జీవితంలో తలపండిన మనిషిలా మాట్లాడుతుంది. మరోసారి పులిహోర బ్యాచ్ టైపు కనిపిస్తుంది. దీంతో ఆమె ఎమోషన్ కి ఆమె ఎదుర్కునే సమస్యలకు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. తర్వాత విరాజ్ పాత్రని కూడా ఇలానే తాడుబొంగరం లేకుండా ట్రీట్ చేశారు. ఆ పాత్ర కూడా అంతే. కాసేపు ప్రేమ అంటాడు ఇంకాసేపు ఫిజికల్ అంటాడు. మొత్తానికి అదొక గోల కింద తయారైయింది. దీంతో పాటు ఆ వీడియో రికార్డింగులు, బ్లాక్ మెయిల్లు, లొంగదీసుకోవడాలు .. పరమరొటీన్ వ్యవహారాలు. ఇలాంటి కథలకు ముగింపు ఇవ్వడం సవాలే. ఈ విషయంలో దర్శకుడు కూడా పెద్ద కసరత్తు చేయలేదు. గుర్తుపెట్టుకునే ముగింపు ఐతే కాదు. నిజానికి ఈ కథకు వైష్ణవి పాత్రని ముగించడమే సరైన ముగింపు అనుకోని ఓ సన్నివేశం వేశాడు దర్శకుడు. కానీ ధైర్యం చేయలేకపోయాడు. మళ్ళీ ఆ పాత్రని కొనసాగించి అందరూ రాజీపడిపోయే ఒక కంఫర్ట్ బుల్ ఎండింగ్ ఇచ్చుకున్నాడు. దీంతో ఫోటో చూసుకుని జీవితాంతం మురిసిపోయే ఓ ఆటోవాల ప్రేమకథగా బేబీ ముగిసిపోయింది.

కథనం-విశ్లేషణ:

కాలం మారుతుంటుంది.. తరాలు మారుతుంటాయి.. ట్రెండు మారుతుంటుంది. కానీ వెండి తెర మీద ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్ ఏది అంటే లవ్ స్టోరీనే. కానీ ప్రేమకథలు ఎఫ్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి పదేళ్లకూ ప్రేమకథల రూపం మారిపోతుంటుంది. ఆ మార్పు యువత ఆలోచన ధోరణిని బట్టే ఉంటుంది. సమాజంలో ఆయా సమయాల్లో అబ్బాయిలు.. అమ్మాయిలు ఎలా ఉన్నారు.. ప్రేమ-పెళ్లి-శృంగారం విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు.. ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది సరిగా అర్థం చేసుకుని తీసే ప్రేమకథలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. పాత్రలు.. సన్నివేశాలు.. సంభాషణలు.. ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా ఉండి.. వాళ్లలో ఒక కదిలిక తీసుకురాగలిగితే వెండితెరపై ప్రేమకథ విజయవంతం అయినట్లే. ‘బేబి’ ఈ కోవకు చెందిన సినిమానే. ఇప్పటి యువత అంతా ఇంతే అంటూ అందరినీ ఒక గాటన కట్టేసి.. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ అంటే ఒక బూటకం అంటూ జనరలైజ్ చేసి చెప్పలేం కానీ.. ప్రస్తుతం పరిణితి లేని వయసులో మొదలయ్యే రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తుంది ‘బేబి’. ఇప్పటి యువత భాషలో చెప్పాలంటే.. ఇదొక ‘నిబ్బా-నిబ్బి’ స్టోరీ. కానీ ఇది యూత్ తో పాటు ‘యూత్’ ఆలోచనలు ఉన్న వాళ్లందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

ఐతే దర్శకుడు ఒక విషయంలో క్లారిటీగా ఉన్నాడనిపించింది. తన టార్గెట్ ఆడియన్స్ టీనేజర్స్. వాళ్ళకు రీచ్ అయ్యేలానే ఇందులో సీన్లు అల్లుకుంటూ వెళ్ళాడు. టీనేజ్ వ‌యసులో ఓ స‌గ‌టు అమ్మాయి ప్రేమ ప‌ట్ల‌, ఆక‌ర్ష‌ణ ప‌ట్ల‌, విలాసాల ప‌ట్ల ప‌డే గంద‌ర‌గోళాన్ని ఈత‌రానికి అర్థ‌మ‌య్యేలా, క‌నెక్ట్ అయ్యేలా చెప్ప‌గ‌లిగాడు. ఓ ర‌కంగా ఇది ఆటోవాలా ఆటో బ‌యోగ్ర‌ఫీ అయినా, ఓ అమ్మాయి ఆత్మ క‌థ‌లా కూడా క‌నిపిస్తుంది. ఒక‌ర్ని మోసం చేయాల‌నుకొంటే ఫ‌ర్లేదు, మ‌న‌ల్ని మ‌నం మోసం చేసుకొంటేనే జీవితం నాశ‌నం అయిపోతుంది అనే ఓ చిన్న పాయింట్ ని అమ్మాయిల కోణంలో చూపించి – అబ్బాయిల మ‌న‌సుల్ని గెలుచుకొన్నాడు ద‌ర్శ‌కుడు.

పాజిటివ్ పాయింట్స్ ఏంటి ?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్

సాయి రాజేష్ దర్శకత్వం

విజయ్ బుల్గానిన్ సంగీతం

డైలాగ్స్

నెగెటివ్ పాయింట్స్ ఏంటి ?
లాంగ్ రన్నింగ్ టైమ్

ఫస్ట్ హాఫ్‌లో కొంత స్లో పేస్.