వైభవంగా భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ..

భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తుల జయజయద్వానాల మధ్య మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, తితిదే నుంచి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అందజేశారు.

*భారీగా తరలివచ్చిన భక్తులు. గతంలో కరుణ ఎఫెక్ట్ వల్ల భక్తులు ఎవరూ హాజరు కాకపోవడం ప్రస్తుతం కరుణ కేసులు తగ్గిపోవడంతో స్వామివారి దర్శనానికి..రాములోరి కల్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో భద్రగిరి మారుమోగుతోంది. ఆలయ ప్రాంగణంతో పాటు భద్రాచలం వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లు స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు అధికారులు అనుమతివ్వలేదు. ఈ ఏడాది అవకాశం ఇవ్వడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా 2 లక్షల ప్యాకెట్ల స్వామి వారి తలంబ్రాలను అధికారులు సిద్ధం చేశారు. కల్యాణోత్సవం పూర్తయిన తర్వాత వాటిని అందజేయనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.