ఉప ఎన్నిక రాగానే కెసిఅర్ కి రైతులపై ప్రేమ ఒలకపోస్తుండు.. బండి సంజయ్.

..

చర్లగూడెం, కృష్ణరాయుని పల్లి ప్రాజెక్టుల్లో భూ నిర్వాసితులు 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఊసెత్తని కేసీఆర్.. రైతులకు తానేదో గొప్ప మేలు చేస్తున్నట్లుగా నటించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. మర్రిగూడ, నాంపల్లి మండలాల రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడి రోదిస్తుంటే వాళ్ల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. కనీసం వాళ్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని దుర్మార్గుడు కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే ఇక్కడి రైతుల పైనా ఎక్కడాలేని ప్రేమను ఒలకపోస్తుండటం విస్మయం కలిగిస్తోందన్నారు. మునుగోడుతో సహా రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలందరికీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో జరిగిన అన్యాయానికి ముమ్మాటికీ కేసీఆరే అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.

8 ఏండ్లలో మునుగోడుకు ఏమిచ్చారు…

మునుగోడు ప్రజలను తన గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలతో తిమ్మిన బమ్మిని చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని బండి సంజయ్ అన్నారు. కానీ 8 ఏళ్లలో మునుగోడుకు కేసీఆర్ ఏమిచ్చారని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక రావడంతో ఎట్లా నిధులు వస్తున్నాయి? పనులెట్లా వేగంగా కదులుతున్నాయో ప్రజలు కళ్ళారా చూస్తున్నారన్నారు. ఉప ఎన్నికలొస్తేనే 8 ఏళ్ల నిర్లక్ష్యాన్ని వీడి కేసీఆర్ పరిగెత్తుకుంటూ మునుగోడుకు వచ్చారని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు దిశగా బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ అహంకారం పూర్తిగా దిగుతుందని మునుగోడు ఓటర్లకు అర్ధమైందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీని గెలిపించేందుకు మునుగోడు ప్రజలంతా సిద్ధమయ్యారున్నారు.

మేకపోతు గాంభీర్యం..

మునుగోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని వింటే… ఆయన గొంతులో వణుకు, మాటల్లో భయం, అసహనం కన్పించాయని బండి సంజయ్ అన్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ పతనం ఖాయమైనట్లుగా ఆయన ప్రసంగంలో స్పష్టంగా కన్పించిందని చెప్పారు. భయంతో చిన్న మెదడు చితికి… చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిపై అవాకులు చవాకులు పేలారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మాట్లాడే భాషేనా అది ? ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారని తెలిపారు. ఈడీ అంటే ఎంత భయమో ఆయన మాటల్లోనే అర్ధమైందని… అందుకే ఆ సంస్థపై నోటికొచ్చినట్లు తూలనాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.