అధికారం లేకుండా కేసీఆర్ బతకలేడు..బండి సంజయ్ వ్యాఖ్యలు..

అధికారం లేకుండా కేసీఆర్ బతకలేడు

మునుగోడులో ఓటుకు 50 వేలిచ్చినా టీఆర్ఎస్ గెలవదు..

బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరంకాదు

ఉప ఎన్నికలొస్తేనే తుంగతుర్తి అభివ్రుద్ధి..

కేసీఆర్ పాలనను బొందపెడితేనే తెలంగాణ తల్లికి బంధ విముక్తి…

మోత్కూరు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ వ్యాఖ్యలు..

అధికారం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ బతకలేడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి కావాలంటూ కేసీఆర్ ఇంట్లోనే లొల్లి జరుగుతోందన్నారు. కొడుకు సీఎం పదవి అడిగితే.. కూతురు పేరు చెప్పి… ఆమె అడిగితే అల్లుడు, సంతోష్ రావు పేరు చెబుతూ చివరి నిమిషం వరకు తానే సీఎం పదవిలో కొనసాగాలనుకుంటున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని వ్యాఖ్యానించారు. ఓటుకు 30 నుండి 50 వేల రూపాయలిచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని, అయినా ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు. కేసీఆర్ పాలనను బొంద పెడితేనే తెలంగాణ బంధ విముక్తి సాధ్యమని చెప్పిన బండి సంజయ్ అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశమివ్వాలంటూ కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మోత్కూర్ లో చేపట్టిన పాదయాత్రకు వేలాదిగా జనం తరలివచ్చారు. రిటైర్డ్ ఏసీపీ బొట్టు క్రిష్ణ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మోత్కూరు ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• ఎన్నికల కోసమో… ఓట్ల కోసమో… ఇక్కడికి రాలేదు. వచ్చింది మీ కోసమే. ఎండలో ఎండుతూ… వానకు తడుస్తూ… సంవత్సరం నుంచి మీ కోసమే పాదయాత్ర చేస్తున్న. మందు గురించి మాట్లాడితే కెసిఆర్ కి కోపం వస్తుంది. మరోసారి కెసిఆర్ కు అవకాశం ఇస్తారా? ( చచ్చినా మళ్ళీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వబోమంటూ ప్రజల నుండి సమాధానం).

• మోత్కూరు ను మూడుముక్కలు చేసిండు కేసీఆర్. లక్షా 80 వేల కోట్లు ఖర్చుపెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తన ఫాంహౌస్ కు నీళ్లు తెచ్చుకున్నారు. ఇక్కడి కాలువను బస్వాపూర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడానికి మాత్రం రూ. 100 కోట్లను కేటాయించడం లేదు.

• నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు ఎదురొడ్డి, ప్రాణత్యాగం చేసిన ఘనత బీజేపీ నేతలదే. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసింది శ్రీకాంతాచారి లాంటి ఉద్యమకారులే. పేదోళ్ల పొట్ట కొట్టి, వాళ్ళ రక్తం తాగి… డబ్బులు దండుకుంటున్నారు.

• ఇక్కడ ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయి? తెలంగాణ కోసం ప్రధాని మోదీ 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేశారు.మోడీ ఇచ్చిన ఇండ్లలో… కేసీఆర్ ఎన్ని కట్టించిండు? ప్రధాని మంజూరు చేసిన ఇండ్లను కట్టిస్తే… పువ్వు గుర్తుకు ఓట్లు వేస్తారని, వాటిని కెసిఆర్ కట్టించడం లేదు.

• మాత్రం 8 నెలల్లో 100 రూములతో ప్రగతి భవన్ ను కట్టుకున్న కేసీఆర్ 8 ఏళ్లయినా పేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు.

• ప్రజలను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్. పేదోళ్లకు ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నది మోడీ నే… ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది కూడా మోడీనే. కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వకపోతే ఇవాళ మనం బతికే వాళ్ళం కాదు.

• వరికి మద్దతు ధర కల్పించిన ఘనత మోడీదే. రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. రైతులకు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వమే. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కింద నిధులను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే.

• మీరు పువ్వు గుర్తుకు ఓటు వేయకున్నా కూడా… తుంగతుర్తి నియోజకవర్గానికి కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. దళితులకు 3 ఎకరాలు, దళిత బందు, ఉద్యోగాలు ఏమయ్యాయని టిఆర్ఎస్ నాయకులను నిలదీయండి.

• తెలంగాణలో అమరవీరుల కల సాకారమైందా? తెలంగాణ కోసం 1400 మంది పేదోల్లు చనిపోతే… కెసిఆర్ రాజ్యమేలుతున్నడు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని దివాళా తీయించిండు.

• కరెంటు ఫ్రీ అంటాడు… ఇవ్వడు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు పెంచింది. 30 గ్రామాలకు ఇవ్వాల్సిన ఫ్రీ కరెంటును… తన ఫామ్ హౌజ్ కు ఇచ్చుకుంటున్నాడు.

• నిజాం ప్రభుత్వం ఎలా ఉంటుందో… కెసిఆర్ మనకి చూపిస్తున్నాడు. ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నాడు. మా కార్యకర్తలపై లాఠీఛార్జి చేయిస్తున్నాడు .

• ‘మునుగోడు’ ఉప ఎన్నికలో ఒక్క ఓటుకు రూ. 30 వేలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడు. హుజురాబాద్, దుబ్బాక, నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలతో ఆరు నెలల చొప్పున టైం పాస్ చేశారు. ఇప్పుడు మునుగోడు పేరుతో మరో ఆరు నెలలు టైం పాస్ చేస్తాడు.

• అధికారం లేకపోతే కెసిఆర్ బతకలేడు. సీఎం సీటు కోసం కేసీఆర్ ఇంట్ల పంచాయతీ నడుస్తొంది. కొడుకు, కూతురు, అల్లుడు, సంతోష్ సీఎం సీటు ఆశిస్తున్నారనే పేరుతో తానే చివరి వరకు సీఎంగా కొనసాగాలని కేసీఆర్ చూస్తున్నడు.

• మునుగోడులో ఓటుకు 30 నుంచి 50 వేలు ఇచ్చినా… టిఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసినా… బిజెపి గెలుపును ఆపలేరు. తుంగతుర్తిలో అభివృద్ధి జరగాలంటే… ఉప ఎన్నిక రావాల్సిందే. ఎప్పుడైనా… ఎక్కడైనా… నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి

• కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి పార్టీలకు అధికారం ఇచ్చారు… ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. కెసిఆర్ రాచరిక పాలనను అంతమొందించాలంటే… అది బిజెపి కే సాధ్యం.

• వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడం లేదు. 20 రోజుల నుంచి విఆర్ఏలు సమ్మె చేస్తున్నా… కనీసం వాళ్లను పిలిచి వాళ్ళతో మాట్లాడిన పాపాన పోలేదు.

• కెసిఆర్ గడీల్లో తెలంగాణ తల్లి బందీ అయింది. తెలంగాణ తల్లిని బంధవిముక్తి రాలిని చేద్దాం. తెలంగాణలో రంగు రంగుల జెండాకు స్థానం లేదు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.