మల్లారెడ్డికి మతిభ్రమించి సీఎంపై ఆరోపణలు: బండ్ల గణేష్..

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డికి మతిభ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానన్నారు. మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా తీసుకోమని బండ్ల గణేష్ అన్నారు. డబ్బు ఉందనే అహంకారంతో మల్లారెడ్డి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పదానికి గౌరవం ఇవ్వాలని, సీఎంను ఏకవచనంతో సంబోధిస్తున్నారని బండ్ల గణేష్ మండిపడ్డారు. ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని, సీఎం రేవంత్ రెడ్డిని టచ్ కూడా చేయలేరని అన్నారు. రోజుకు 20 గంటలు పనిచేస్తున్న ఏకైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని బండ్ల గణేష్ కొనియాడారు. రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని, అర్ధ రహిత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదని బండ్ల గణేష్ అన్నారు.

కాగా గాంధీ భవన్‌లో మల్కాజ్ గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేశారు. ఇంద్రవెళ్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన అద్బుతంగా ఉందని కొనియాడారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని బండ్ల గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు..