రెండ్రోజుల సమ్మెకు బ్యాంకు సంఘాలు పిలుపు…

రెండ్రోజుల సమ్మెకు బ్యాంకు సంఘాలు పిలుపు

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై బ్యాంకు సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె చేపట్టనున్నటు తొమ్మిది బ్యాంకు సంఘాల ఐక్యవేదికగా ఏర్పాటైన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) వెల్లడించింది. ఈ తొమ్మిది సంఘాల నేతలు మంగళవారం సమావేశమై బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన సంస్కరణల అంశంపై చర్చించారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు ఆమె ప్రతిపాదించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్టు ఆలిండియా బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఐఏబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌. వెంకటాచలం తెలిపారు. బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణల అంశాలపై చర్చించినట్టు ఆయన చెప్పారు. ఐడీబీఐ బ్యాంకు, మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు, ఎల్‌ఐసీ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, బీమా రంగంలోకి 74శాతం మేర ఎఫ్‌డీఐలకు అనుమతి, పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు ఆయన వివరించారు. సమావేశంలో అన్ని అంశాలపై చర్చించిన అనంతరం మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపునివ్వాలని నిర్ణయించినట్టు ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి సౌమ్యాదత్తా తెలిపారు.

ఈ సమావేశంలో ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్‌ కన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ), నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ (ఎన్‌సీబీఈ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓఏ), బ్యాంకు ఎంప్లాయీస్‌ కన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఐఎన్‌బీఈఎఫ్‌), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంకు ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌బీఏసీ), నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంకు వర్కర్స్‌ (ఎన్‌ఓబీడబ్ల్యూ), నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంకు ఆఫీసర్స్‌ (ఎన్‌ఓబీఏ) సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.