24 విభిన్న డిజైన్లు.. 10 రకాల రంగుల్లో..బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ కానుకల పంపిణీ..మంత్రి కేటీఆర్‌.

ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ కానుకలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి.. ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్‌టైల్‌ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని, వారి వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు. తద్వారా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు…

24 విభిన్న డిజైన్లు.. 10 రకాల రంగుల్లో..
గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తులు, నిఫ్ట్‌ డిజైనర్ల సహకారంతో సరైన డిజైన్లు, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ఏడాది బతుకమ్మ చీరెల నూతన డిజైన్లతో ఉత్పత్తి చేశామన్నారు. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, పది రకాల ఆకర్షణీయ రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల)తో తయారు చేయబడిన 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను టెక్స్‌టైల్‌ శాఖ తయారు చేసిందన్నారు. మహిళలకు 92లక్షల సాధారణ చీరెలు, వయోవృద్ధులకు తొమ్మిది మీటర్ల పొడువున్న చీరెలు 8లక్షలు తయారు చేయించామన్నారు. మొత్తంగా కోటిచీరెలను రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డు కలిగిన ప్రతీ ఆడబిడ్డకు అందించనున్నట్లు చెప్పారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాధి కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరెల ప్రాజెక్టు కోసం రూ.339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరెరలను ఆడబిడ్డలకు ఐదు దఫాలుగా అందించినట్లు కేటీఆర్‌ వివరించారు.