బతుకమ్మ_పాట..

బతుకమ్మ_పాట.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆకాశ దేశాన ఉయ్యాలో
అలవి గానీ శక్తి ఉయ్యాలో
పృథ్వి గా మారింది ఉయ్యాలో…
ప్రాణమే దాల్చింది ఉయ్యాలో..
జీవులై మెరిసింది ఉయ్యాలో..
సృష్ఠిగా చూసుకుని ఉయ్యాలో
బతుకమ్మ అయ్యింది ఉయ్యాలో
బంగారు కాంతులా ఉయ్యాలో
బ్రహ్మమే మెరిసింది ఉయ్యాలో
ప్రాణి కోటిగ తాను ఉయ్యాలో
ఊపిరులె ఊదేను ఉయ్యాలో
ఆకాశమూ భూమి ఉయ్యాలో
సయ్యాటలాడేను ఉయ్యాలో
ఆకసమె వాయువై ఉయ్యాలో..
ఊయలూపిందమ్మ ఉయ్యాలో
వాయువే అగ్నిగా ఉయ్యాలో
తేజమై మెరిసింది ఉయ్యాలో
తేజమే జలములై ఉయ్యాలో
పరుగెత్తి కురిసింది ఉయ్యాలో
జలములే పృథ్వి కీ ఉయ్యాలో
పురుడు పోసిందమ్మ ఉయ్యాలొి
రూపమే దాల్చిందమ్మ ఉయ్యాలో
బతుకమ్మ నిలిచింది ఉయ్యాలో

ఆకాశ పుష్పమై ఉయ్యాలో
భువి తాను వెలసింది ఉయ్యాలో
గంధాలశక్తిలో ఉయ్యాలో
పరిమళించిందమ్మ ఉయ్యాలో
జలములా శక్తిగా ఉయ్యాలో
రసనమే మేల్కొంది ఉయ్యాలో
తేజపూ శక్తిగా ఉయ్యాలో
దృష్టి నిలిచిందమ్మ ఉయ్యాలో
వాయువూ శక్తిగా ఉయ్యాలో
స్పర్శనే చూపింది ఉయ్యాలో
ఆకాశ శక్తిగా ఉయ్యాలో
శబ్దమై వెలసింది ఉయ్యాలో
బ్రహ్మ శక్తీ తానుగా ఉయ్యాలో
బ్రాహ్మియై వెలసింది ఉయ్యాలో
పంచభూతములైదుగా…ఉయ్యాల
పంచశక్తులకాదిగా ఉయ్యాల
దశ ఇంద్రియాలైనవీ ఉయ్యాల…
దేహమే దాల్చినాదీ ఉయ్యాల
దేవతే వచ్చినాదీ ఉయ్యాల…
జీవుడై దిగివచ్చినా ఉయ్యాల
శివునకూ ప్రాణమే పోసీనదీ ఉయ్యాల…
స్థిరముగా నిలచినట్టీ ఉయ్యాల
శైలమే తానవ్వగా ఉయ్యాల..
మనసనే మహిమనూ కలిపీనదీ ఉయ్యాల..
బుద్ధిగా తానైనదీ ఉయ్యాల.
సమయించి చూసినట్టీ ఉయ్యాల
చిత్తముగ నిలచీనదీ ఉయ్యాల
అహమంటు ఇహమంటునూ ఉయ్యాల
అద్దాల ఆటాడగా ఉయ్యాల…
వెలుగు చీకట్లు గానూ ఉయ్యాల

వేరు లేనీ ఆటలూ ఉయ్యాల
ఆడేటి పాపాయిలే ఉయ్యాల

బతుకమ్మ మా కంటిలో ఉయ్యాల
పాపాయి తానైనదీ ఉయ్యాల..!!

శివునకూ రాణైనదీ ఉయ్యాల
శిశువులకు తల్లైనదీ ఉయ్యాల

ఈ భువిని పాలించగా ఉయ్యాల
పరమేశు పదమైనదీ ఉయ్యాల..

వేల కాంతుల సిరులతో ఉయ్యాల దేహాలు తొడిగిందిలే ఉయ్యాల..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో…