ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై స్పందించిన…కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్…

తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై స్పందించారు…బ్రిటీష్ దురాగతాలపై డాక్యుమెంటరీ ఎందుకు తీయలేదని ఆయన బీబీసీని ప్రశ్నించారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బాగా రాణిస్తోందని, దీంతో విదేశీ డాక్యుమెంటరీ నిర్మాతలు నిరాశకు గురయ్యారని ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థ తీర్పుల కన్నా.. ఆ డాక్యుమెంటరీని నమ్ముతున్న వారిని చూసి తాను చింతిస్తున్నానని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆరిఫ్ ఖాన్.. ‘ఇది భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం. ఈ డాక్యుమెంటరీని తీసుకురావడానికి ఈ నిర్దిష్ట సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ప్రత్యేకించి భారతదేశం తన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేదని.. దేశం ముక్కలవుతుందని స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అంచనా వేసిన వారి నుంచి వచ్చిన డాక్యుమెంటరీ ఇది” అని అన్నారు.