BBC కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు..

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (BBC) కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

India: The Modi Question డాక్యుమెంటరీని భారత దేశంలో అధికారికంగా ప్రసారం చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో దీనిని ప్రసారం చేయవద్దని, దీనికి సంబంధించిన ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 21న ఆదేశించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన హింసాకాండ సమయంలో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాత్రపై ఈ డాక్యుమెంటరీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ప్రచారాస్త్రమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.

మీడియా కథనాల ప్రకారం, ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది ఫోన్లను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు స్వాధీనం చేసుకుని, వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని కోరినట్లు తెలుస్తోంది. బీబీసీ వ్యాపార కార్యకలాపాలు, భారత దేశంలోని బీబీసీ శాఖకు చెందిన కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం..