కులవృత్తులకు రూ. లక్ష సాయం నియోజకవర్గానికి 300 మందికి…

పేదల సంక్షేమంలో సాటిలేని తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నది. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ సాయం అందజేయనున్నది.

వచ్చే వారం నుంచి పంపిణీ
సచివాలయంలో సమీక్షించిన మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ.

*🔹గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల స్వీకరణ*
*నియోజకవర్గానికి 3వేల మందికి..
*20 నుంచి దరఖాస్తుల పరిశీలన.
*25న పథకం ప్రారంభం*

పేదల సంక్షేమంలో సాటిలేని తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నది. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ సాయం అందజేయనున్నది. ఈ మేరకు సచివాలయంలో నగర ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీలు పథకం అమలుపై సమీక్షించారు. వచ్చే వారం నుంచి అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా సాయం అందిస్తామని ప్రకటించారు. మరో వైపు పేదల ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల ఆర్థిక సాయం కోసం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 20 నుంచి దరఖాస్తులను పరిశీలించి, 25న పథకం ప్రారంభించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కులవృత్తిదారులకు సర్కారు ఆర్థిక చేయూత అందించేందుకు చర్యలు ప్రారంభించింది. వచ్చే వారం నుంచి నాయీ బ్రాహ్మణులు, రజకులు, కుమ్మరి, కంసలి, కంచర, వడ్రంగి, పూసల, మేదర, వడ్డెర, అరేకటిక, మేర తదితర కులవృత్తులకు అర్హులైన ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో దరఖాస్తులను సమగ్ర విచారణ చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఒక్కో నియోజవర్గ పరిధిలో 300 మందికి లబ్ధి చేకూర్చనున్నామని, దశల వారీగా లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు. బుధవారం బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో బీసీ కులవృత్తి దారులకు ఆర్థిక సహాయం పంపిణీపై హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ కులవృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని మంత్రి తలసాని వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మౌజం ఖాన్‌, కౌసర్‌ మోహినుద్దీన్‌, కలెక్టర్‌ , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, కలెక్టర్‌ అనుదీప్‌, బీసీ కార్పొరేషన్‌ అధికారి ఆశన్న, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు ఆఫీసర్‌ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.గృహలక్ష్మి దరఖాస్తుల స్వీకరణ
అర్హులైన వారు ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఉంటే ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు అందజేయనున్నది. అయితే గురువారంతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా.. ఈ నెల 25వ తేదీ నుంచి గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, మండల తాషీల్దార్ల కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన అధికారులు ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించనున్నారు. అందులోనుంచి 15వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 25వ తేదీ నుంచి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందజేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు..జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది ఎంపిక
గృహలక్ష్మి పథకానికి అర్హులైన వారిని ధ్రువపత్రాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు మహిళ పేరిట ఉండి, గృహ సంబంధిత స్థలం కలిగి ఉండాలి. తెల్ల రేషన్‌, ఓటర్‌, ఆధార్‌, ఆధాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మంది లబ్ధిదారుల చొప్పున జిల్లా వ్యాప్తంగా 15వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.