భారత క్రికెట్ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకం..

R9TELUGUNEWS.com
టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యాడు. నవంబరు 14న టీ20 వరల్డ్‌కప్ 2021 ముగియనుండగా.. ఈ టోర్నీతో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. దాంతో.. హెడ్ కోచ్ భర్తీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గత అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకోగా.. అతడ్ని బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ కోచ్‌గా ఎంపిక చేస్తూ బీసీసీఐకి ప్రతిపాదనని పంపింది. దాంతో.. బీసీసీఐ అధికారికంగా రాహుల్ ద్రవిడ్‌ని కోచ్‌గా నియమిస్తూ బుధవారం ప్రకటనని విడుదల చేసింది. భారత అండర్-19 కోచ్‌గా ఇప్పటికే పనిచేసిన రాహుల్ ద్రవిడ్.. సీనియర్ టీమ్‌కి పూర్తి స్థాయిలో కోచ్‌గా పనిచేయబోతుండటం ఇదే తొలిసారి…భారత్ తరఫున 1996 నుంచి 2012 వరకూ మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్.. తన సుదీర్ఘ కెరీర్‌లో 164 టెస్టులు, 344 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో 48 సెంచరీలు నమోదు చేసిన ద్రవిడ్.. రిటైర్మెంట్ తర్వాత భారత అండర్-19 టీమ్‌కి హెడ్ కోచ్‌గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లని వెలుగులోకి తీసుకొచ్చాడు. ద్రవిడ్ పర్యవేక్షణలోనే అండర్-19 వరల్డ్‌కప్‌ని భారత యువ జట్టు గెలిచింది.