గాజా, పాలస్తీనా ప్రజలకు ఆయన బహిరంగ మద్దతు…జమియత్-ఎ-ఉలేమా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి జమియత్-ఎ-ఉలేమా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి పెద్ద ప్రకటనే చేశారు…గాజా, పాలస్తీనా ప్రజలకు ఆయన బహిరంగ మద్దతు ప్రకటించారు. వారికి అండగా ఉంటామని, వారికి ఏం అవసరం ఉన్నా ఏర్పాటు చేస్తామని అన్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ మంత్రి మౌలానా సిద్ధిఖుల్లా అందుకు పరోక్షంగా పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి మాట్లాడుతూ.. ”ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం ద్వారా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. చర్చల ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. మేము గాజాకు, పాలస్తీనాకు మద్దతుగా నిలబడతాము. వారికి ఏది అవసరమో దానిని ఏర్పాటు చేస్తాము. వారికి అన్నీ అందజేస్తాం” అని అన్నారు. మౌలానా సిద్ధిఖుల్లా చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాస్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ అండ్ లైబ్రరీ సర్వీసెస్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు.