బేతాళ కథలు – సదానందుని కథ..

బేతాళ కథలు –
సదానందుని కథ

పూర్వం చంద్రకూటమను నగరమును వీరవర్మ అను మహారాజు పాలించుచుండెను. ఆతని భార్య మణిమాల. వారు ఒకనాడు వివాహం చూచుటకు బంధువుల నగరానికి వెళ్ళిరి. వివాహపు ముచ్చటలు అన్నియు ముగిసినవి. తిరిగి వీరవర్మ-మణిమాల తమ నగరానికి బయలుదేరిరి. వారు బయలుదేరిన శకటం అర్ధరాత్రమునకు ఒక అడవి మధ్యభాగమునకు వచ్చినది. ఆ అడవి దాటినచో వారి నగరం వచ్చును. కానీ, ఆ కటిక చీకటిలో బయలు దేరుటకు వారు శంకించి, ఆ రాత్రి అక్కడ గడిపి- వేకువజాముననే నగరం చేరుటకు నిశ్చ యించుకొన్నారు.

ఒక పెద్ద మర్రివృక్షం క్రింద రధం ఆపించినారు. శకటచోదకుడు (సారథి) కొంచెం దూరంలో పడుకొన్నాడు. దంపతులిద్దరూ ఆ చెట్టు క్రిందనే పవళించినారు. ఆ దంపతులు నివసించిన మర్రిచెట్టు పై ఒక రాక్షసుడు నివసించి యుండెను. వాడు రాజదంపతులు అక్కడ సవళించుట చూచి, సహించలేక పోయాడు.

“ఓరీ! నా నివాసము క్రింద భార్యతో సల్లాపాలు ఆడుతున్నావా? మూర్ఖ! చూడు మీ
యిద్దరినీ యిప్పుడే యమాలయానికి పంపిస్తాన” ని మీదికి రాబోయాడు.

రాజదంపతులు భయపడుచు ”తెలియక మేమీ వృక్షము క్రింద పరున్నాము. ఉదయమే లేచి వెళ్ళిపోగలము” అని ప్రార్థించారు.

రాక్షసుని కోరిక

రాక్షసుడు యిలా అన్నాడు. “తెలిసినా, తెలియకపోయినా నా నివాసాన్ని అపవిత్రము చేశారు. ఇందుకు మీరు నాకు నరబలి యివ్వాలి. అదీ ఎనిమిదేండ్లు నిండిన బాలుని బలియివ్వాలి. అట్లా చేస్తామని మీరు వాగ్దానము చేస్తే మిమ్ము విడిచి పెడతా, లేదా యిప్పుడే మిమ్ము హతమారుస్తానని హూంక రించాడు.

రాజదంపతులు వాగ్దానం చేశారు. రాక్షసుడు శాంతించాడు. రాజదంపతులు వేకువజాముననే లేచి బయలుదేరి తమ నగరం చేరుకొన్నారు. రాజు తలచిన దెబ్బలకు కొరతా! అన్నట్లు ఒక పేద బ్రాహ్మణునికి బంగారం, ఒక గ్రామం ఆశచూపి, వారి కుమారుని పదేండ్ల వానిని సంపా దించారు.

ఆ మరునాడే రాజదంపతులు బాలునితో రాక్షసుడు ఉన్న చెట్టువద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని కుమారుని పేరు సదానందుడు. ఆఖరు కోరిక ఏమిటని రాజు ఆ బాలుని ప్రశ్నించాడు. ఆ బాలుడు మాటాడక ఆకాశంవైపు చూస్తూ పకపక నవ్వ నారంభించాడు. ఆ నవ్వుతో రాక్షసుని మనస్సు మారిపోయింది. “బలి అవసరం లేదు. మీరు హాయిగా వెళ్ళండి!” అని వెళ్ళిపోయాడు.

మహారాజా! విన్నావుకదా కథ! ఆ బాలుడు ఎందుకు నవ్వెనో చెప్ప గలవా? అని భేతాళుడు అని ప్రశ్నించెను. విక్రమార్కుడు ఆలోచించి” బుద్బుద ప్రాయమైన శరీరం పై వీరందరకూ ఎంత మమకారం! ఏనాటికై నా వీరుకూడ చచ్చేవారేకదా! అని వారి తెలివి లేమికి, భగవంతుని తలచుకొని నవ్వినాడు ఆ బాలుడు”. అన్నాడు.

మౌనభంగం కావడంతో భేతాళుడు ఎరిగి తన వృక్షానికి చేరుకొన్నాడు.
( సశేషం )