భేతాళ కథలు..

భేతాళ కథలు..
6వ కథ అదృష్ట హీనుడు*

♦️విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా… నీవు ఏ మహాపరాధం చేసిన కారణం చేత ఈ నిశిరాత్రివేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు. కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పూ చెయ్యకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు. ఇందుకు తార్కాణంగా సాకేతుడనే వాడి కథ చెబు తాను విను” ఈ విధంగా చెప్ప సాగాడు.

♦️ఉసీనరదేశంలో సాకేతుడనేవాడు కసాయిగా జీవించే వాడు. వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది. అందుచేత చుట్టు పట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కు పోయేవారు. వాడు గొర్రెల పెంపకంలో కూడా నిపుణుడు కావటం చేత వాడికి మంచి పేరూ, డబ్బూ కూడా లభించాయి.

♦️ఇట్లా ఉండగా ఒకనాడొక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరి కొత్త వెండి నాణెం ఇచ్చి వెళ్ళాడు.

♦️సాకేతుడు ఆ నాణెం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచీలో వేశాడు. అది మొదలు ప్రతి రోజూ ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణెం ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కు పోతూ వచ్చాడు. కొంతకాలం గడిచింది.

♦️సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొటేళ్ళను కొనటం అలవాటు. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్న దనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి, మంచి పొటేళ్ళను ఏరి కొనుక్కొచ్చి, వాటికి తగిన తిండి పెట్టి, పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతుండే వాడు.

♦️ఈసారి అతనికి పొటేళ్ళ బేరం మీద బయలుదేరాలనిపించి, తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుదామని సంచీ తీశాడు. అందులో చెయ్యి పెట్టి అతను గుప్పెడు నాణాలు పైకి తీశాడు. కాని అతని గుప్పిట్లోకి వచ్చినవి నాణాలు కావు చిల్లపెంకులు ! కంగారు పడి అతను సంచీని బోర్లించాడు.

♦️సంచీ నిండా చిల్ల పెంకులే తప్ప ఒక్క వెండి నాణెం లేదు!

♦️ముసలివాడు తనను మోసం చేశాడనుకుని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ, “వాణ్ణి ఈ సారి కనబడనీ ” ఈ కండకు కండ చీల్చేస్తాను!” అంటూంటే, మాంసం కొన వచ్చినవారు, “ఏం జరిగింది ? ఎవరు నిన్ను మోసం చేశారు ?” అని అడిగారు.

♦️ఇంతలో ముసలివాడే మాంసం కొనటానికి వస్తూ కనిపించాడు. సాకేతుడు తన దుకాణం నుంచి బయిటికి దూకి, ముసలి వాడికి ఎదురు పరుగెత్తుకుంటూ వెళ్ళి, మెడ పట్టుకుని, “దుర్మార్గుడా ! వంచకుడా ! నన్ను మోసం చేస్తావా?” అని ఆరిచాడు, అందరినీ కేక వేశాడు.

♦️ముసలివాడు రహస్యంగా,నోరు మూసుకో ! నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చెయ్యగలను!” అన్నాడు.

♦️సాకేతుడు ఆవేశంతో, ముసలివాడి , మాటలు లక్ష్య పెట్టక, “ నన్ను ఏం చెయ్యగలవు రా, మాయదారి వాడా ?” అని మరింత గట్టిగా అరిచాడు.

♦️ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలాగా, ” నీ రహస్యం నాకు తెలిసిపోయింది. అందరికీ చెప్పక మానుతాననుకుంటున్నావా ?… అయ్యా, చూడండి ! ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్య పెట్టి గొర్రె మాంసమని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు. ఈ క్షణానే వీడి ఇంట మనిషి శవం ఉన్నది !” అన్నాడు.

♦️” అబద్ధం ! పచ్చి అబద్ధం! నీ మాట ఋజువు చెయ్యి !” అన్నాడు సాకేతుడు.

♦️ఋజువు చెయ్యక ఊరుకుంటానా ? నీ రహస్యం పది మందికీ తెలియవద్దా? పద, నీ యింటికి నడు!” అంటూ ముసలివాడు, పది మందినీ వెంటబెట్టుకుని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు. వాడి ఇంటి వెనుక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి కళేబరం ఉన్నది. ముసలివాడు శక్తి గల మాంత్రికుడు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాన్ని చూడగానే సాకేతుడు కేవలమూ ఆశ్చర్యపోయాడే గాని, మిగిలిన వాళ్ళంతా ఆగ్రహావేశం చెందారు.

♦️అందరూ అతని పైన పడి చావ చితకపొడిచారు. సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక, అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు. ఆ దొమ్మిలో సాకేతుడికి ప్రాణం పోలేదన్నమాటే గాని, ఎడమ కన్ను కాస్తా పోయింది. అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అతనికి ఉండిన ఇల్లూ, డబ్బూ, సమస్తమూ పోయింది.

♦️ఇక దేశంలో తాను బతకలేనని తెలుసుకుని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టేపని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చెయ్యసాగాడు. అభ్యాసం అంతగా లేకపోయినా, కులవిద్యే గనక అతను కాస్త మంచి పేరు తెచ్చుకుని, పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది.

♦️ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూచుని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలూదినచప్పుడూ, గుర్రపు డెక్కల చప్పుడూ వినపడింది. అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటికి వచ్చేసరికి, ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు.

♦️ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని, ” ఆ ఒంటి కంటి వెధవను నూరు కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి,” అని చెప్పి, వేట ప్రయత్నం మానేసి, గుర్రాన్ని తిప్పుకుని తన నగరమునకు తిరిగి వెళ్ళిపోయాడు.

♦️వెంటనే రాజభటులు సాకేతుణ్ణి పట్టుకుని వీపు మీదా కాళ్ళ మీదా కొరడాలతో కొట్టి, ” దేశం విడిచి పో! లేకపోతే నీకు మరణ దండన పడుతుంది !” అన్నారు. ‘

♦️ఇంతకూ నేను చేసిన మహాపచారమేమిటి?” అని సాకేతుడు రాజభటులను అడిగాడు.

♦️“ఒంటి కంటివాడు కనిపించటం మా రాజుగారు. పెద్ద దుశ్శకునంగా భావిస్తారు. అందులోనూ ఎడమ కన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు!” అని రాజ భటులు సాకేతుడికి చెప్పారు.

♦️రాజాజ్ఞ ప్రకారం సాకేతుడు ఆ దేశం విడిచి పెట్టి మరొక దేశం వెళ్ళి, అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకుని నివసించ సాగాడు. అతను ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేవాడు కాడు, తల ఎత్తి ఎవరినీ చూసేవాడు కాడు. ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిపినాక అతనికి ఊపిరాడనట్టయింది. కాస్త పది మంది మధ్యకూ వెళ్ళి, స్వేచ్ఛగా గాలి పీల్చి, ప్రపంచం వైపు ఒకసారి చూడాలన్న తహ తహ అతనిలో పెరగసాగింది.

♦️అందుచేత ఒక రాత్రి సాకేతుడు తల మీదుగా ఒక దుప్పటి కప్పుకుని, వీధుల వెంట బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే అతనికి మతిపోయినట్టయింది. ఏ రాజ భటులో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను కాలి బలం కొద్దీ పరిగెత్తుతూ సందుల వెంటా, గొందుల వెంటా పడిపోయి, ఒక ఇంటి వాకిలి తలుపు తోశాడు. తలుపు తెరుచుకున్నది. లోపల అంధకారపూరిత మైన గొంది కనిపించింది.

♦️ఒక ఘడియ సేపు ఆ చీకట్లో దాగి ఉండి తరువాత నిమ్మళంగా ఇంటికి చేరుకుందామనుకున్నాడు సాకేతుడు. కాని అతను చీకటిలోకి ప్రవేశించి పక్క గోడను. ఒదిగి నిలబడిన మరుక్షణంలో ఇద్దరు మనుషులు ఆతని పైన పడి, “దొరికావా, దుర్మార్గుడా ? ఎంత కాలం తప్పించుకు తిరుగుదామనుకున్నావు?” అంటూ అతన్ని పట్టి బంధించారు.

♦️సాకేతుడు సగం చచ్చి, ” బాబూల్లారా, నేను మీకే మపకారం చేశాను? నన్నెందుకు ఇలా పట్టుకున్నారు?” అని అడిగాడు.

♦️మూడు రోజుల నుంచీ నువు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకుని ఆయనను వెంబడిస్తూ, పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకు పారి పోవటం లేదా? ఆమాయకుడిలా నటించకు,” అన్నారు ఆ మనుషులు.

♦️”మీ రెవరో, మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే?” అన్నాడు సాకేతుడు.

♦️” నీ అబద్ధాలు నమ్మటానికి మేమేం వెర్రి వాళ్ళ మనుకున్నావా? మా యజమానిని హత్య చెయ్యటానికి కాకపోతే ఈ యింటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు? నీ దగ్గర కత్తి లేదూ ?” అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుడిని వెతకగా అతను తోలు కోసుకునే ఉలి దొరికింది.

♦️దానితో వాళ్ళ అనుమానం రూఢి అయింది. వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు. న్యాయాధి కారి సాకేతుడిని పరీక్ష చేయించగా అతను అదివరకే కొరడా దెబ్బల శిక్ష పొందినవాడని తెలిసిపోయింది. అందుచేత ఆటే విచారించవలిసిన పని కూడా లేకుండా, ” వీడు పాత నేరస్తుడే. నూరు కొరడా దెబ్బలు కొట్టి, దేశ బహిష్కారం చెయ్యటమే వీడికి శిక్ష!” అన్నాడు న్యాయాధికారి.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపంలాటి తన వృత్తిని పోగొట్టుకుని, ఎక్కడా తల ఎత్తుకు తిరగటానికి లేని స్థితిలో పడి, ప్రపంచానికంతకూ శత్రువై, పనికిమాలినవాడై అకారణంగా ఒక శిక్ష తరువాత మరొక శిక్ష అను భవించటానికేమిటి కారణం? ఈ నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, “సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు. అతను బలవద్విరోధం తెచ్చి పెట్టుకున్నాడు. అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచీ అతని కష్టాలు ఆరంభమయాయి. చిల్లపెంకులను వెండి నాణాలుగా కనపడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు, మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతి క్రియ ఎట్లా చేయాలో ఆలోచించి ఉండవలసింది.

♦️సాకేతుడు అలా చేయక, తొందరపడి ఆ మాంత్రికుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఒకసారి భ్రష్టుడైనవాడికి వికాసం ఉండదు. స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటమూ పెద్ద ఆపదగా పరిణ మించింది. స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోవును,” అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.