భేతాళ కథలు..దారికి వచ్చిన భార్య..

.భేతాళ కథలు..దారికి వచ్చిన భార్య…

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే శ్మశానం వైపు మౌనంగా నడవసాగాడు. అప్పుడు. శవంలోని బేతాళుడు, ‘రాజా, యుక్తి తెలియని కారణం చేత నీవు ఇలా కష్టపడుతున్నావేమోనని నాకు అనుమానంగా ఉన్నది. పూర్వం గుహచంద్రుడనేవాడు. యుక్తి చేతనే కదా తన భార్యను దారికి తెచ్చుకున్నాడు! శ్రమ తెలియకుండా నీ కథని కథ చెబుతాను విను.” అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.

♦️”పూర్వం పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడనే గొప్ప వర్తకుడుండేవాడు. అతని భార్య చంద్రప్రభ గర్భవతిగా ఉండి, ఒక చక్కని చుక్క లాంటి కుమార్తెను కన్నది. ఆ శిశువు భూమి మీద పడుతూనే, దివ్యమైన కాంతులు పురిటింట వెదజల్లుతూ, లేచి కూర్చుని, స్పష్టంగా మాట్లాడనారంభించింది. పురిటింట ఉన్న స్త్రీలందరూ ఇది చూసి దిగ్భ్రామ చెంది, ధనగుప్తుడికి కబురుచేశారు.

♦️ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి, శిశువు ముందు సాష్టాంగ పడి, “దేవీ, నా గర్భవాసాన పుట్టిన నువ్వెవరు?” అని అడిగాడు.

♦️”నే నెవరైతే నేమి? నేను నీ యింటనే పెరిగి, నీకు శుభం చేకూర్చుతాను. నన్ను ఎన్నడూ ఒకరి కిచ్చి పెళ్ళి చెయ్యకు,” అన్నది ఆ శిశువు.

♦️ధనగుప్తుడు అలాగేనని, తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు లోకానికి ప్రకటించి, సోమప్రభ అని పేరు పెట్టి, తన ఇంట ఆమెను రహస్యంగా పెంచి పెద్దదానిని చేశాడు. కాలక్రమాన యుక్తవయస్కురాలై, సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారయింది.

♦️ఇంతలో వసంతోత్సవం వచ్చింది. సోమప్రభ తమ అ
ఇంటి పైభాగం నుంచి వేడుకలు గమనిస్తున్నది. ఆ సమయంలో గుహచంద్రుడనే వైశ్య యువకుడు ఆమెను చూసి మోహావేశంతో వెంటనే మూర్ఛ పోయాడు. తిరిగి స్పృహ వచ్చాక అతను ఇంటికి వెళ్ళి, విరహబాధతో తీసుకోసాగాడు.

♦️అతని తండ్రి గుహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమక పడ్డాడు. అప్పుడు గుహచంద్రుడి మిత్రులు ఆయనతో జరిగిన సంగతేమిటో చెప్పారు.

♦️అప్పుడు గుహపేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి, మంచిగానే, “మీ అమ్మా యిని నా కొడుకుకిచ్చి పెళ్ళిచెయ్యి.” అని అడిగాడు.

♦️”నీ కేమైనా మతిపోయిందా ఏమిటి? నాకు కూతురెక్కడ ఉన్నది?” అన్నాడు ధనగుప్తుడు.

♦️మంచిగా పని జరగదని తెలుసుకుని గుహాసేనుడు రాజును చూడబోయాడు. ఆయన రాజుకు లోగడ అనేక విధాల సహాయం చేసి ఉన్నవాడు కావటం చేత, తాను కోరితే రాజు సహాయం చెయ్యక పోడని అనుకున్నాడు.

♦️ఆయన రాజుకొక రత్నాన్ని కానుక ఇచ్చి, “మహారాజా, తమ వల్ల ఒక చిన్న సహాయం కావాలి,” అనగానే రాజు తప్పక చేస్తాను అదేమిటో చెప్పమన్నాడు.

♦️గుహసేనుడు రాజుతో, ధనగుప్తుడికొక కుమార్తె ఉన్నదనీ, తన కొడుకు ఆ కన్యను మోహించాడనీ, తాను వెళ్ళి కన్యనిమ్మని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటున్నాడని చెప్పాడు.

♦️’రాజు గుహసేనుడి వెంట కొంత సేనను ఇచ్చి, “ధనగుప్తుడి కుమార్తెను బలాత్కారంగా తెచ్చి, నీ కొడుక్కు చేసుకో” అన్నాడు. గుహసేనుడు అట్టహాసంగా సేనను వెంట బెట్టుకుని వెళ్ళి ధనగుప్తుడి ఇంటిని ముట్టడించాడు.

♦️తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడటం చూసి సోమప్రభ ధనగుప్తుడితో, “నాన్నా, నా కోసం ఎందుకు ఇన్ని చిక్కులు పడతావు ? నన్నా వైశ్య కుమారుడి కిచ్చి పెళ్ళి చెయ్యి, కాని నేను నా భర్తతో కాపురం చెయ్యనని మాత్రం నీ వియ్యంకుడితో చెప్పు.” అన్నది.

♦️ధనగుప్తుడు గుహసేనుడిని పిలిపించి, నా కుమార్తెను నీ కొడుకుకి ఇచ్చి పెళ్ళి చేస్తాను. కాని ఆమె నీ కొడుకుతో కాపురం మటుకు చెయ్యదు,” అన్నాడు.

♦️పెళ్ళి చేసుకున్నది కాపురం చెయ్యకుండా ఎలా ఉంటుంది. లెమ్మనుకుని గుహసేనుడు, ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి, తన కుమారుడికి సోమ ప్రభను చేసుకుని, కోడలిని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సమప్రభ, ఎవరెన్ని చెప్పినా తన భర్తతో బాటు పడకగదిలో ప్రవేశించ నిరాకరించింది.

♦️అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో, పెళ్ళి చేసుకున్న మనిషి కాపురం ఎలా చెయ్యకుండా ఉంటుంది? దాన్ని గదికి తీసుకుపో అని చెప్పాడు.

♦️వెంటనే సమప్రభ తన మామగారిని వేలితో బెదిరించింది. ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరి, గుండె పగిలి, ప్రాణాలను వదిలాడు.

♦️”ఇది మనిషి కాదు, మహామారి, నా ప్రారబ్ధం కొద్ది ఇది నాకు భార్యగా దాహరించింది,” అనుకుని గుహచంద్రుడు తన భార్య జోలికి పోక, భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి, వైరాగ్యంతో జీవిస్తూ, రోజూ బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు. సోమప్రభ, వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలిస్తూ ఉండేది.

♦️ఇలా ఉండగా ఒకనాడొక ముసలి బ్రాహ్మణుడు గుహచంద్రుడి ఇంట భోజనం చేసి, సోమప్రభ చేతి నుంచి దక్షిణ తాంబూలం తీసుకుంటూ, ఆమె ఆలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. తరువాత ఈయన గుహచంద్రుడితో రహస్యంగా,”నాయనా, ఆ అమ్మాయి నీకేమవుతుంది ?” అని అడిగాడు.

♦️గుహచంద్రుడొక పెద్ద నిట్టూర్పు విడిచి, తన వివాహ కథ అంతా ఆ ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు. అంతా విని ఆ వృద్ధుడు, ‘నాయనా, ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి, ఇక్కడనే పడుకోనియ్యి. నీ కొక చిత్రం చూపించి, నీ సమస్య పరిష్కారమయేటట్టు చేస్తాను,” అని చెప్పాడు.

♦️అందుకు గుహచంద్రుడు సమ్మతించి, ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకోనిచ్చాడు.

♦️ఒక రాత్రి వేళ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో, సమప్రభ ఇంటి నుంచి బయలుదేరింది. బ్రాహ్మణుడు గుహచంద్రుణ్ణి నిద్రలేపి, “నా వెంట రా!” అన్నాడు. ఆయన గుహచంద్రుణ్ణి తన యోగశక్తి చేత ఒక తుమ్మెదగా మార్చి, తాను కూడా తుమ్మెద రూపం ధరించాడు. రెండు తుమ్మెదలూ సమప్రభను వెన్నంటి వెళ్ళాయి.

♦️సమప్రభ చాలా దూరం వెళ్ళి, ఒక పెద్ద మర్రిచెట్టు కిందికి చేరింది. అక్కడ చక్కని సంగీతమూ, దివ్యమైన గానము వినిపిస్తున్నాయి. ఒక దేవతాస్త్రి, సమ ప్రభను పోలినదే, ఒక గొప్ప ఆసనం మీద కూర్చుని ఉన్నది. సమప్రభ వెళ్ళి, ఆ అననం మీదనే, ఆ దేవతాస్త్రి పక్కన ఆసీనురాలు అయింది. తరువాత ఆ ఇద్దరు స్త్రీలూ దివ్యమైన ఆహారం తిని, దివ్యమైన పానీయాలు తాగారు.

♦️తరువాత సమప్రభ రెండవ స్త్రీతో, “అక్కా, ఇవాళ మా యింటికి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయనను గురించి ఆలోచిస్తే నా కేదో భయంగా ఉన్నది. ఎందుకైనా మంచిది, నేను త్వరగా తిరిగి పోతాను,” అంటూ లేచి, తన ఇంటికి బయలుదేరింది.

♦️తుమ్మెద రూపంలో ఉన్న గుహచంద్రుడు అదంతా కళ్ళారా చూసి, చెవులారా విన్నాడు.. సమప్రభ ఇంటికి బయలుదేరగానే, తుమ్మెదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడూ, గుహచంద్రుడూ శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగివచ్చి, తమ సహజ రూపాలు ధరించి, ఏమీ ఎరగనట్టు పడుకున్నారు. సమప్రభ కూడా తిరిగివచ్చింది.

♦️బ్రాహ్మణుడు గుహచంద్రుడితో, “చూశావు గదా, నాయనా? నీ భార్య మానవ స్త్రీ కాదు, దేవతా స్త్రీ. ఆ సంగతి ఆమెకు తెలుసును. ఏ శాప ఫలితంగానో ఆమె మానవజన్మ ఎత్తినప్పటికీ తనవారితో ఆమెకు సంబంధం తెగలేదు. అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చెయ్యటానికి ఒప్పుకుంటుందా? నీకొక యుక్తి చెబుతాను. అలా చేశావంటే నీ భార్య నీతో కాపరం చెయ్యటానికి సిద్ధపడుతుంది,” అని చెప్పి, గుహచంద్రుడికొక తంత్రం తెలిపి, తన దారిన తాను వెళ్ళాడు.

♦️మర్నాడు చీకటి పడ్డాక గుహచంద్రుడి ఇంటికి చక్కగా అలంకరించుకుని ఒక వేశ్య వచ్చింది. గుహచంద్రుడామెను తన గదికి తీసుకుపోయి, ఆమెతో సరససల్లాపాలాడసాగాడు.

♦️అదంతా సమప్రభ చూసింది. ఆ తన భర్తను అవతలికి పిలిపించి, ఎవతె?” అని అడిగింది.

♦️” ఆమె ఒక వేశ్య నన్ను అమితంగా ప్రేమించింది. నన్ను తన ఇంటికి తీసుకుపోవటానికి వచ్చింది. నేను పోతున్నాను.” అని గుహచంద్రుడు అబద్ధాలాడాడు.

♦️కట్టుకున్న దాన్ని నేనుండగా మిమ్మల్ని ప్రేమించటానికి అది ఎవతె? మీరు వెళ్ళటానికి వీలులేదు,” అన్నది. సమప్రభ,

♦️అది మొదలు ఆమె తన భర్తతో సక్రమంగా కాపరం చేస్తూ, గుహచంద్రుడికి అంతులేని ఆనందం కలిగించింది.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, దేవతాస్త్రీ అయి ఉండి కూడా సమప్రభ సాధారణం స్త్రీ లాగా అసూయ చెందటానికి కారణమేమిటి ? ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని నిరూపించిన వృద్ధ బ్రాహ్మణుడే ఆమెకు ఈర్ష్య కలిగించే తంత్రం ఎందుకు చెప్పాడు? అది ఆమె పైన ఎలా పారింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది.” అన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, “దేవతా స్త్రీలు మానవులను ప్రేమించటం అసంభవం కాదు. అలా జరిగిన సందర్భాలెన్నయినా ఉన్నాయి. సమప్రభ గుహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపురం చెయ్యలేదు. అంతేగాని, తాను దేవతా స్త్రీ అయి ఉన్నందు వల్ల కాదు. కాక ఈర్ష్య మాట. ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష్య కూడా సాధ్యమే. సమప్రభలో ప్రేమ లోపించటం చేత కనీసం ఈర్ష్య అయినా కలగటానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు, ఆ యుక్తి పారింది,” అన్నాడు.

రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.