*ఫిబ్రవరి 24 గురువారం సీతమ్మ జయంతి సందర్భంగా…*
*సీతాష్టమి*
హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. రామాయణము సీతాయాశ్చరితం మహత్ అని చెప్పబడింది. జానకి, మైధిలి, వైదేహి, రమ కూడా సీత పేర్లు. సీతను తరచు సీతమ్మ తల్లి, చల్లని తల్లి అని వివిధ రచనలలోను, కీర్తనలలోను ప్రస్తావిస్తారు.
క్షమ..దయ…ధైర్యం…వివేకం…ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర ‘సీత’. సతీ లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలు మరియు మేథావులు పరిశోధనలు కూడా చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం.
రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి… ధర్మమూర్తి: సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ’.
మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు ‘సీత’ అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాశం శుక్లపక్షంలో జరిగింది.
ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్ పూర్ , అప్పటి మిధిలా నగరమని చెబుతారు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.
తన కుమార్తె ‘వీర్యశుల్క’ అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి “కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది” అని సీతారాముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది.
*సీతమ్మ వ్యక్తిత్వం…*
రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి ఆమె. తన రక్షణ కోసం పెట్టుకున్న నియమం కన్నా దానమే గొప్పదన్న నీతిని ఆమె ఈ సందర్భంలో వెల్లడిస్తున్నది.
పతివ్రత నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ధీరత్వంతో ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది.
సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యేదాకా మిథిలానగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటికొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులెదురైనప్పటికీ తమే పరిష్కరించుకోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడన్న అభిమానవతి సీత.
ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద ఎనలేని ప్రేమ కలిగిన స్త్రీమూర్తి సీత. అదే ప్రేమతో అందమైన జింకను తన కోసం తీసుకురమ్మని భర్తను అభ్యర్థిస్తుంది సీత, రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత. సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే..ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.
సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలు.
రాక్షస సంహారం తర్వాత సీతను అవోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం. అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.
*ఫలం*
సీతాష్టమి రోజున, ఉదయం స్నానం చేసిన తర్వాత సీతారాములను పూజించేందుకు ముందు గణపతిని పూజించాలి. పసుపురంగు పువ్వులు, పసుపు బట్టలు సీతమ్మతల్లికి సమర్పించాలి. శ్రీ జానకి రామాభ్యామ్ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పాలు,బెల్లంతో చేసిన వంటలను నైవేద్యంగా సమర్పిస్తే అన్నీ శుభాలే జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.