భేతాళ కథలు..పారని తంత్రం…

భేతాళ కథలు..పారని తంత్రం..

♦️పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, మంత్ర తంత్రాలను నమ్ముకున్నందువల్ల ఒక్కొక్కసారి ఊహించని పరిణామాలు కలుగుతాయి. తంత్రం చేసేది ఒకరైతే ఫలితం మరొకరిదవుతుంది. ఇందుకు నిదర్శనంగా నీకు భోజరాజు కథ చెబుతాను విను,” అంటూ విధంగా చెప్పసాగాడు.

♦️విజయపురిని ఏలే భోజరాజుకు మంజుళ అనే కుమార్తె ఉండేది. కొడుకైనా, కూతురైనా ఆ పిల్ల ఒక్కతే గనక రాజు ఆమెను అమిత గారాబంగా పెంచాడు. ఆమెకు యుక్తవయసు వచ్చింది. ఆమెను చేసుకునే వాడు ఆమె తండ్రి రాజ్యానికి కూడా వారసుడవుతాడు గనక, ఆమెకు మంచి సంబంధాలే వచ్చాయి. కాని అవేవీ ఆమెకు నచ్చలేదు. తన కుమార్తెకు నచ్చనివాణ్ణి తెచ్చి బలాత్కారంగా పెళ్ళిచేసే ఉద్దేశం భోజరాజుకు ఎంత మాత్రమూ లేదు.

♦️ఇలా ఉండగా ఒకనాడు రాజకుమార్తె తన పరివారంతో రాజోద్యానానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి, తనకు భర్త కాదగిన వాణ్ణి తాను ఆ సాయంకాలం చూశాననీ, అతన్ని తప్ప తాను మరెవ్వరినీ పెళ్ళాడననీ తండ్రికి తెలిపింది.

♦️రాజు చిక్కులో పడ్డాడు. తన కుమార్తె కళ్లచూసి వరించిన యువకుడెవరో, అతని పేరేమిటో, వంశ మేమిటో, ఎక్కడ ఉంటాడో, ఎలా జీవిస్తాడో ఏమీ తెలియదు. అతను మంజుళను పెళ్ళాడటానికి తగునో, తగడో నిర్ణయించే ముందు అతణ్ణి పట్టుకోవలసి ఉన్నది.

♦️రాజు మంత్రిని సలహా అడిగితే, మంత్రి మర్నాడు రాజుగారు నగరం విధులన్నీ ఊరేగటానికి ఏర్పాట్లు చేసి, నగరంలో ఉండే వారెవరైనా సరే రాజుగారి దర్శనం చేసుకుని తమ తమ కష్టాలు చెప్పుకొనవచ్చునని చాటింపు వేశాడు. ఈ ఊరేగింపు చూసే జనంలో రాజకుమార్తె వరించిన యువకుడు కనబడతాడని మంత్రి. ఆలోచన.

♦️ఆయన ఎత్తు పారింది. మర్నాడు రాజు తన కుమార్తెతో సహా ఏనుగు అంబారీలో ఎక్కి నగరపు వీధులన్నీ తిరుగుతుండగా మంజుళ తాను వరించిన యువకుణ్ణి ఒక చోట చూసి, తన తండ్రికి చెప్పింది. రాజు తన భటులలో చురుకైన వాళ్లను దగ్గరికి పిలిచి, రాజకుమార్తె చూపిన యువకుణ్ణి గురించి దొరికినన్ని వివరాలు సంపాదించుకు రమ్మని ఆజ్ఞాపించాడు.

♦️రాజుగారు ఊరేగింపు పూర్తిచేసి రాజభవనం చేరే సరికల్లో వాళ్ళు ఆ యువకుణ్ణు గురించి సాధ్యపడి నంత సమాచారం తీసుకొచ్చారు.

♦️ఆ కుర్రవాడి పేరు సర్వదాయి. అతని తల్లిదండ్రులెవరో అతనికే తెలియదు. ఎవరో ముసలిది అతన్ని ఈ నగరానికి తెచ్చి పెంచింది. ఆ ముసలిది పోయి చాలా ఏళ్ళయింది. కుర్రవాడు చాలా అందంగానూ, ఆకర్షవంతంగానూ ఉండటం చేత చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అభిమానించి, ఆ దిక్కులేని బిడ్డకు ఏ లోటూ ‘లేకుండా చూస్తూ వచ్చారు. కొంతకాలమయాక గురుశుశ్రూష చేసి ఆ కుర్రవాడు చదువుకున్నాడు. అతడు అందకాడే గాక బుద్ధిమంతుడు కూడా… అందుచేత అతనికి తెలిసినవాళ్లంతా ఆప్తులే.

♦️ఈ సమాచారం విని రాజు తన కుమార్తెతో, “అమ్మా, నువ్వు నీ మనసు మార్చుకో… ఈ సర్వదాయిది ఏ వంశమో కూడా తెలీదు. పట్టి అనాథ జీవి. ఎంతలేసి రాజకుమారులను కాదని నువ్వు ఆ కుర్రవాణ్ణి పెళ్ళాడితే నిన్ను లోకం పరిహసిస్తుంది. అతన్ని నా రాజ్యానికి వారసుణ్ణి చేశానంటే నేనసలు గురిలోనూ మరి తల ఎత్తుకు తిరగటానికి ఉండదు, అన్నాడు.

♦️”మీరు లక్ష చెప్పండి. నేను ఆ అబ్బాయిని తప్ప మరెవర్నీ పెళ్ళాడను. అతన్ని పెళ్లాడ లేకపోతే చచ్చేపోతాను,” అన్నది మంజుళ. రాజు ఈ మాట విని నిలువునా నీరై పోయి, మంత్రిని పిలిపించి సలహా అడిగాడు. మంత్రి ఆ రాత్రల్లా ఆలోచించి, మర్నాడు ఉదయానికి ఒక గొప్ప ఆలోచన రాజుగారికి విన్నవించాడు. అదేమిటంటే-

♦️పదిహేను పదహారేళ్ల క్రితం కాశ్మీరు రాజ వంశంలో స్పర్ధలు పుట్టుకొచ్చి, ఒక వర్గం శత్రువులకు అనుకూలం కావటమూ, రాజ భవనంలో తిరుగుబాటు సాగటమూ, అడవులకు పారిపోయిన రాజునూ, నాలుగైదేళ్ల వయస్సు గల రాజకుమారుణ్ణి శత్రుసైనికులు వేటాడి హత్య చేయటమూ జరిగాయి. ఆ కాశ్మీరు రాజకుమారుడి హత్య వాస్తవంగా జరగలేదనీ, అతను ప్రచ్ఛన్నంగా ఎక్కడో బతుకుతున్నాడనీ ఒక పుకారు చుట్టుపక్కల రాజ్యాలలో లేవదీయాలి. సర్వదాయికి ఉండే పుట్టుమచ్చలు మొదలైనవి ఆ కాశ్మీరు రాజకుమారుడికి ఉండినట్టు ప్రచారం చెయ్యాలి. సర్వదాయే ఆ కాశ్మీరు రాజకుమారుడన్న మాట జనంలో నుంచే పుట్టేటట్టు చెయ్యాలి. ఆ తరవాత మంజుళను అతనికిచ్చి పెళ్ళి చేస్తే పదిమందీ హర్షిస్తారేగాని, ఎవరూ తప్పు పట్టరు.

♦️మంత్రి చేసిన ఈ ఆలోచన రాజుకు అమోఘంగా కనబడింది. ఈ పుకార్లు పుట్టించే బాధ్యత కూడా రాజు మంత్రికే వదిలిపెట్టి, తన కుమార్తె దగ్గరికి వెళ్ళి, “అమ్మా, నీకూ, నీవు కోరిన వాడికి పెళ్ళి జరిగిందే అనుకో ! దానికిక అడ్డేమీ ఉండదు. నాకు మాత్రం ఒక సంవత్సరం గడువియ్యి. వచ్చే ఏడు ఈ పాటికి గాని మీ ఇద్దరి పెళ్ళి వైభవంగా జరిపించటానికి తగిన పరిస్థితి ఏర్పడదు,” అన్నాడు.

♦️రాజకుమార్తె అందుకు సరే నన్నది. ఈ లోపల మంత్రి కొందరు వేగులవాళ్లను చుట్టుపట్ల దేశాలకు పంపాడు. వాళ్ళు అక్క డక్కడా సత్రాలలోనూ, రచ్చలలోనూ కనిపించిన జనంతో, ” మాది కాశ్మీరు దేశం. మేము మా పాత మహారాజుగారి కొడుకు కోసం దేశాలన్నీ గాలిస్తున్నాం. అందరూ అనుకున్నట్టు అతను అరణ్యంలో చావలేదు. అతని ముసలి దాది అతన్ని కాపాడి ఈ ప్రాంతాలకు వచ్చిందన్నారు. ఆ కుర్రవాడికి కుడిచెవి కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఇంకా ఫలానా ఫలానా లక్షణా లుంటాయి,” అంటూ ప్రచారం చేశారు..

♦️ఈ పుకార్లు ఇతరుల ద్వారా విజయపురికి కూడా చేరాయి. కాశ్మీరు రాజకుమారుడి లక్షణాలు విన్నవాళ్ళు సర్వదాయిలో ఆ లక్షణాలుండటం గమనించి, “మన సర్వ
దాయే ఆ కాశ్మీరు యువరాజు కాదు గదా!” అని ఆశ్చర్యపడ్డారు. అనుమానం క్రమంగా దృఢపడి ఆ నోటా ఆ నోటా, “సందేహం లేదు. శత్రువుల నుంచి తప్పించుకున్న ఆ కాశ్మీరు రాజకుమారుడే మన మధ్య అనాథగా తిరుగుతున్నాడు. విధి ఎంత విచిత్రమైనది!” అన్నారు.

♦️సర్వదాయి మేలు కోరినవాళ్ళు, “సర్వ చాయికి మళ్ళీ మంచి రోజులు తప్పక వస్తాయి. అందుచేతనే అతని జన్మరహస్యం ఇలా బయటపడింది. ఏ రాజకుమార్తె అతన్ని పెళ్ళాడటానికి ఎగిరి గంతెయ్యదు ? ఆ తరువాత అతను తన మామగారి సహా యంతో తన రాజ్యాన్ని క్షణంలో తిరిగి గెలుచుకుంటాడు,” అన్నారు.

♦️సర్వదాయికి కూడా ఆ పుకారులో విశ్వాసం కుదిరింది. అతను తిరిగి రాజు కావటానికి ఎదురు చూడసాగాడు.

♦️అతని నమ్మకానికి తగ్గట్టే ఇద్దరు రాజులు తమ కుమార్తెల చిత్తరువులను దూతల ద్వారా అతని వద్దకు పంపి, తమ కుమార్తె నచ్చినట్టయితే అతనికిచ్చి పెళ్ళి చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని కబురు చేశారు. సర్వదాయి ఇద్దరు రాజకుమార్తెల చిత్తరుఫులూ చూసి, అందులో కనకపురం రాజ కుమర్తెను మోహించి, ఆమెను పెళ్లాడటానికి సమ్మతించాడు.

♦️పరిస్థితి ఇంతదాకా వచ్చాక భోజరాజుకు ఇక తాను తన కుమార్తెను సర్వదాయి కిచ్చి పెళ్ళి చేయవచ్చుననీ, ఎవరూ ఆక్షేపించరనీ ధైర్యం కలిగింది. అందుచేత అతను సర్వ దాయిని తన ఇంటికించి, తన కుమార్తెను చూపించి, “నువు నా కింది పౌరుడివే కనక పెళ్ళి కోసం దేశాంతరం పోనవసరం లేదు. నా కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకో,” అన్నాడు.

♦️”నన్ను మన్నించాలి. నేను అదివరకే మరొక రాజకుమార్తెకు నా మనసూ, మాటా కూడా ఇచ్చేశాను,” అని చెప్పి సర్వదాయి సెలవు పుచ్చుకున్నాడు.

♦️సర్వదాయి తనను నిరాకరించాడని తెలియగానే మంజుళ మూర్ఛపోయి,ఆ మూర్ఛలోనే ప్రాణాలు వదిలింది.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, మంజుళ దుర్మరణానికి ఎవరు బాధ్యులు ? ఆమెను నిరాకరించిన సర్వదాయా ? ఒక సంవత్సరం లోపుగా అతన్ని తెచ్చి ఆమెకు పెళ్ళి చేస్తానని ఆమెను నమ్మించిన రాజా? అతను ఒక ప్రచ్ఛన్న రాజకుమారుడని లోకాన్ని నమ్మించటానికి తంత్రం నడిపిన అతని మంత్రా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది,” ఉన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, ఇందులో సర్వదాయి తప్పేమీ లేదు. అతను రాజు కుమార్తెను ప్రేమించవలసిన అవసరమేమీ లేదు. అతను పెళ్ళాడకపోతే చచ్చిపోతానని రాజకుమార్తె మొదటనే చెప్పింది. ఆమె తండ్రి తప్పుకూడా ఏమీలేదు. మంత్రి సలహా ఇవ్వటానికి ఆశక్తుడైన పక్షంలో తన కూతురి తృప్తి కోసం ఆయన ఒక అనామకుడికైనా ఆమెనిచ్చి ఉండేవాడే. తప్పు మంత్రిది. ఆయన తంత్రం ఆలోచించినప్పుడు కనీసం సర్వదాయికైనా తన ఎత్తుగడ తెలియనిచ్చి ఉండవలసింది.

♦️సర్వ దాయి తానొక అజ్ఞాత యువరాజు ననుకోక పోతే మంజుళను ఒక్కనాటికి నిరాకరించి ఉండకపోను. అనుపానం తెలియకుండా గొప్ప ఔషధాన్ని వాడే వైద్యుడిలాగా మంత్రి గొప్ప తంత్రమే పన్నాడుగాని, దాని సాఫల్యం గురించి ఎలాటి జాగ్రత్తా పడక పోయాడు. అందుచేతనే మంజుళ దుర్మరణం పాలయింది,” అన్నాడు.

♦️రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.