భేతాళ కథలు..దొరికిన సొమ్ము.

భేతాళ కథలు..దొరికిన సొమ్ము..

*మంచి కథలు*

♦️పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు మీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే, మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, శ్రమపడుతున్నందుకు నీవు విచారించకు. ఎందుకంటే, సముద్రశూరుడి లాగా నీవు కూడా కష్టకాలంలోనే శుభాన్ని కూడా పొందవచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సముద్రశూరుడి కథ చెబుతాను విను.” అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.

♦️పూర్వం హర్షవర్మ ఏలిన హర్షపురంలో సముద్రశూరుడనే గొప్ప వర్తకుడుండేవాడు. అతను ఒకసారి సరుకుతో సహా సముద్రం మీద సువర్ణద్వీపానికి ప్రయాణ మయ్యాడు. ప్రయాణం చాలా వరకు సుఖంగానే సాగింది గాని, సువర్ణద్వీపం చేర వస్తూండగా ఆకాశాన కారుమేఘాలు కమ్మి, ప్రళయంగా గాలి వీచి, సముద్రం అల్ల కల్లోలమై, సముద్రశూరుడెక్కిన ఓడ కాస్త ముణిగిపోయింది.

♦️మునిగిపోయే ఓడ నుంచి సముద్ర శూరుడు నీటిలోకి దూకి ఈద నారంభించాడు. అలా ఈదుకుంటూ పోతున్న సముద్రశూరుడి కేసి ఏదో శవం కొట్టుకు వచ్చింది. సముద్రశూరుడు దాన్ని తెప్పగా ఉపయోగించి తీరానికి చేరాడు.

♦️అతను శవాన్ని ఒడ్డుకు లాగి పరీక్షించగా దాని బొడ్డున ఒక మూట కనిపించింది. మూట విప్పి చూడగా అందులో ఒక అమూల్యమైన మణి గల కంఠాభరణం ఉన్నది. సముద్రశూరుడు ఎన్నో విలువైన రత్నాలను చూశాడు, కాని అలాంటి మణిని ఎన్నడూ చూడలేదు. అతను సముద్రంలో పోగొట్టుకున్న సరుకు కన్న ఈ మణి అనేక వందల రెట్లు విలువ గలది. ఆ సంగతి గ్రహించి పరమానందం చెంది, సముద్ర శూరుడు కలశపురమనే నగరానికి వెళ్ళి, నగరం వెలుపల ఉండే ఆలయంలో నడుము వాల్చాడు.

♦️చాలా సేపు శ్రమపడి ఈది అలసి ఉండటానికి అతనికి వెంటనే నిద్రపట్టింది. తనకు దైవికంగా దొరికిన కంఠాభరణాన్ని చేతిలోనే ఉంచుకుని సముద్రశూరుడు గాఢనిద్రలో పడ్డాడు.

♦️కొంతసేపయాక నగర రక్షకులు అటుగా వచ్చారు. వాళ్ళు అతని చేతిలో ఉన్న కంఠాభరణాన్ని చూస్తూనే గుర్తించారు. అది చక్రసేన అనే రాజకుమార్తిది. దాన్ని దొంగ లెత్తుకుపోయారు. ఆ నిద్ర పోయేవాడే దొంగ అయి ఉంటాడనుకుని రక్షకభటులు సముద్రపశూరుణ్ణి నిద్ర లేపి, అతణ్ణి ఉద్యానంలో ఉన్న రాజు దగ్గరికి తీసుకుపోయారు.

♦️”నువ్వెవరు? ఈ కంఠాభరణం నీ కెలా వచ్చింది?” అని రాజు అడిగాడు.

♦️సముద్రశూరుడు జరిగినది జరిగినట్టుగా చెప్పి, “నాకు దొరికిన శవం సముద్ర తీరాన ఇంకా ఉండవచ్చు. కావలిస్తే మనుషులను పంపి విచారించండి, మహారాజా,” అన్నాడు.

♦️రాజు ఏమీ అనక ముందే ఎక్కడి నుంచో ఒక గద్ద రివ్వున వచ్చి, రాజు చేతిలోని కంఠాభరణాన్ని తన్నుకుని వాయు వేగంతో వెళ్ళిపోయింది.

♦️సొమ్ము పోయినా నేర విచారణ చెయ్యక తప్పదు గనక రాజు తన మనుషులను సముద్రశూరుడి వెంట సముద్ర తీరానికి పంపాడు. శవం ఇంకాకా అక్కడే ఉన్నది. అది ఆ నగరానికి చెందిన ప్రసిద్ధుడైన చోరుడి శవం కావటం చేత రాజభటులు వాడిని గుర్తించి, రాజుతో ఆ సంగతి చెప్పారు. సముద్రశూరుడు చెప్పినది నిజమని రుజువయింది. రాజు ధర్మబుద్ధి గలవాడు.

♦️ఆయన సముద్రశూరుడికి కొంత డబ్బూ, కొంత వర్తకసామగ్రీనిచ్చి, ఓడ ఎక్కించి అతన్ని అతని దేశానికి పంపేశాడు. ఈ సారి సముద్రశూరుడు క్షేమంగానే సముద్రం దాటాడు. అతను ఒక బిడారు వెంట తన సరుకులతో సహా హర్షపురానికి బయలుదేరాడు. వర్తకులందరూ ఆరణ్య మార్గాన ప్రయాణిస్తూ, రాత్రివేళ ఒక చోట మజిలీ చేశారు.ఆ రాత్రి దొంగల గుంపొకటి వాళ్ళపైన పడి దొరికిన దల్లా తీసుకుని, అందిన వాళ్ళ నందరినీ హత్య చేయ సాగారు. సరుకుపోతే పోయింది అనుకుని సముద్రశూరుడు అక్కణ్ణించి పారిపోయి, ఒక మర్రి చెట్టెక్కి, ఆకుల మధ్య దాక్కున్నాడు.

♦️దొంగలు దొరికిన సరుకంతా కొల్లగొట్టి తమ దారిన తాము వెళ్ళిపోయారు.

♦️అయినా, తెల్లవారి బాగా వెలుతురు వచ్చిన దాకా సముద్రశూరుడు చెట్టు మీదే ఉండిపోయాడు. తరువాత అతను చెట్టు దిగుదామని అటూ ఇటూ చూసే సరికి, సమీపంలో ఉన్న కొమ్మ మీది తొర్రలో తళుక్కున ఏదో మెరిసింది. సముద్ర శూరుడు దాన్ని సమీపించి, రాజకుమార్తె కంఠాభరణాన్ని గుర్తించాడు. ఎక్కడో సముద్రం అవతల కలళపురంలో గద్ద తన్నుకుపోయిన ఆ కంఠాభరణం, తలవని తలంపుగా ఈ భయంకరమైన అరణ్యం మధ్య ఈ మర్రిచెట్టు మీద తనకు రెండో సారి దొరకటం సముద్రశూరుడికి అంతులేని ఆశ్చర్యం కలిగించింది.

♦️అతను చెట్టు దిగి వచ్చి, తన నగరం, చేరుకుని, కంఠాభరణాన్ని తమ రాజుకే విక్రయించి, వర్తకం మానేసి, నిశ్చింతగా జీవించాడు.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా నా కొక్క సందేహం సముద్రశూరుడు ఆ కంఠాభరణాన్ని ఎలాగైనా కలశపుర రాజుకు ఇవ్వక తానే ఎందుకుంచుకున్నాడు? లోభం చేతనా? లేక మరొకసారి తనకు దొంగతనం అంటగట్టుతారనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావా నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, ఆ కంఠాభరణాన్ని రాజు రెండుసార్లు పోగొట్టుకున్నాడు. మూడోసారి పోగొట్టుకోడని ఏమిటి? అలాగే అది తనకు రెండుసార్లు దైవికంగా దొరికింది. అలాంటి దాన్ని ఎందుకు వదులుకోవాలి? అది అలా ఉండగా, వర్తకం కోసం తాను వెంట పెట్టుకు పోయిన సరుకు ఒకసారి సముద్రం పాలయింది, రెండోసారి దొంగలు దోచారు. ఇక తనకు వర్తకం అచ్చిరాదనుకున్నాడు. తాను సముద్ర ప్రయాణాలు చెయ్యకుండా ఆ హారాన్ని రాజుకు చేర్చటం సాధ్యం కాదు. అన్నీ ఆలోచించి సముద్ర శూరుడు ఆ కంఠాభరణాన్ని తానే ఉపయోగ పరచు కున్నాడు.” అన్నాడు.

♦️రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు…