బిగ్ బాస్-5 వేదికగా వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తతకు ముందుకొచ్చిన కింగ్ నాగార్జున…

బిగ్ బాస్-5 వేదికగా వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తతకు ముందుకొచ్చిన కింగ్ నాగార్జున.

•అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన కింగ్ నాగార్జున*
•*ప్రతి ఒక్కరు ఈ మూడు వారాలు మూడు మొక్కలు నాటి 2021 కి ఫినిషింగ్ ఇవ్వాలని పిలుపు*
•బిగ్ బాస్ హౌస్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మొక్క.
•కోట్లది మొక్కలు నాటిన సంతోష్ కుమార్ కి బిగ్ బాస్ అభినందనలు.

మీరు ఇప్పటి వరకు ఓ మూడు కోట్ల వరకు మొక్కలు నాటారా ? అంటూ హోస్ట్ నాగార్జున అడగ్గానే, చిన్న చిరునవ్వుతో… 16 కోట్ల మొక్కలు నాటామని బదులిచ్చారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్యులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఇలా ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణలతో బిగ్ బాస్ హౌస్ ఒక చక్కటి సందేశాన్ని బుల్లితెర ప్రేక్షకులకు అందించింది.

తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న సంచలన టీవీషో *బిగ్ బాస్* హౌస్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నినాదం మార్మోగింది. యువ ప్రతిభావంతులైన నటులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు ముగ్ధులవుతున్న కోట్లాదిమంది ప్రజానీకానికి ఒక మంచి సందేశం అందించాలనే తలంపుతో… నిర్వాహకులు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను భాగం చేశారు. *“పచ్చదనమే రేపటి ప్రగతి పథమని”* ప్రపంచానికి చాటి చెప్పారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” గురించి ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. *ఈ సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా మూడు వారాల సమయం ఉందని.. ఇప్పటి వరకు ఎన్నో చేసుంటాం కానీ, ఈ మూడు వారాలు.. వారానికి ఒకటి చొప్పున మూడు మొక్కలు నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలని నాగార్జున కంటెస్టెంట్స్ కి, ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.* అంతేకాదు మొక్కలు నాటడమే ఒక కార్యక్రమంగా పెట్టుకొని కోట్లాది మొక్కలు నాటించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని స్టేజిపైకి ఆహ్వానించారు.

గత నాలుగైదు సంవత్సరాలుగా, మొక్కలు నాటడం, నాటించడం ఒక దినచర్యగా పెట్టుకొని కోట్లది మొక్కలు నాటారు.. నిజంగా మీ కృషికి హ్యాట్సఫ్ సర్ అంటూ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని అభినందించారు. ఒక్క మనిషి తన ఆలోచనతో, ప్రకృతి బావుండాలనే తపనతో కోట్లది మొక్కలు నాటితే.. బిగ్ బాస్ హౌస్ పిలునిస్తే ఇంకా ఎన్ని కోట్ల మొక్కలు నాటొచ్చో ఊహించుకోండని ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేశారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టి భవిష్యత్ తరాలు ఈ భూమిపై మనుగడ సాగించాలంటే.. మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని నాగార్జున ప్రేక్షకులకు సూచించారు.

జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మొక్కలు నాటాలి, కాపాడాలి అనే ఆలోచనను కలిగించాలని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం తీసుకున్నాం. ఒకచోట ఒకరు ఒకటి రెండు మొక్కలు నాటారు, మరోచోట టీంలుగా కొంతమంది కలిసి మొక్కలు నాటారు. ఇక స్టార్స్, సెలెబ్రెటీలు అయితే ఫారెస్ట్ లను దత్తత తీసుకున్నారు. ప్రభాస్ ను తీసుకుంటే 1643 ఎకరాలు, హెటిర్ డ్రగ్స్ పార్ధసారథి రెడ్డి గారు 2500 ఎకరాల అడవులను దత్తత తీసుకొని మొక్కల్ని పెంచుతున్నారు. మేం నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నాం. శక్తి ఉన్నంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తునే ఉంటాం, మా ఈ ప్రయత్నం ఇవ్వాల మీ ద్వారా కోట్లమందికి చేరింది. ఇంత అద్భుతమైన షోలో మా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు భాగస్వామ్యం కల్పించిన నాగార్జున గారికి, స్టార్ మా కు, బిగ్ బాస్ నిర్వాహకులకు, కంటెస్టెంట్స్ కి, టెక్నిషీయన్లకి కృతజ్ఞతలు తెలిపారు.

చివరగా నాగార్జున మాట్లాడుతూ.. సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”, వారి మాటలు, స్పూర్తి నన్నెంతగానో కదిలించాయి.. తాను కూడా వారు ఎక్కడ చూపెడితే అక్కడ అడవిని దత్తత తీసుకొని పెంచుతాను.. సమాజం పట్ల నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను. అంతేకాదు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు అందించిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటి వారి స్పూర్తిని కొనసాగిస్తామని ప్రకటించారు.