శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్..!!12 మంది ఎంపీలు మరికాసేపట్లో ఢిల్లీకి..!

ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మరో బిగ్ షాక్ తగలబోతోందని తెలుస్తోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా శివసేన రెబల్, మహారాష్ట్ర (Maharashtra)ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు జై కొట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 12 మంది ఎంపీలు మరికాసేపట్లో ఢిల్లీ చేరుకుని ఈ మేరకు తమ నిర్ణయాన్ని మీడియా సమావేశం ద్వారా వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. అసలే రాజకీయంగా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న ఉద్ధవ్ థాక్రేకు(Uddhav Thackrey) మరో బిగ్ షాక్ తగిలినట్టే భావించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన కొద్దిసేపటికే ఈ రకమైన పరిణామం చోటు చేసుకోబోతోందనే వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది…రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) మద్దతు ఇవ్వాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము అలా చేయకూడదని.. కానీ తాము సంకుచితంగా ఆలోచించడం లేదని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. దేశానికి తొలిసారిగా ఓ ఆదివాసీ గిరిజన మహిళ రాష్ట్రపతి కావడాన్ని తాము సమర్థిస్తున్నామని అన్నారు. గతంలోనూ తాము ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలకు ఈ రకంగానే మద్దతు ప్రకటించామని అన్నారు.