బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే..

దిల్లీ: బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, జేడీయూ అధినేత, సీఎం నీతీశ్‌కుమార్‌ మళ్లీ భాజపా తో చేతులు కలుపుతారన్న వార్తలపై  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు గానీ, కూటమి నుంచి వైదొలగుతున్నట్టు గానీ స్పష్టమైన సమాచారం లేదన్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ లో జేడీయూ బలమైన పార్టీయేనని చెప్పారు. గత రెండు, మూడు రోజులుగా వస్తున్న వార్తలపై ఆయనకు లేఖ రాశానని, ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించానని అన్నారు. నీతీశ్‌ మనసులో ఏముందో తెలియడం లేదన్నారు. ఆదివారం దిల్లీ వెళ్తున్నట్లు చెప్పిన ఖర్గే.. బిహార్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరించి, స్పష్టత వచ్చిన తర్వాత మీడియాకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. 
మరోవైపు నీతీశ్‌కుమార్‌ భాజపా మద్దతుతో ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేయడం, మరికొంత మందిని విధుల నుంచి తప్పించడంతో ప్రభుత్వ మార్పిడి దాదాపు ఖాయమే అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. కేంద్రంలో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లే. సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష పార్టీల మధ్య వరుస విభేదాలు తలెత్తడం కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు తృణమూల్‌ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌మాన్‌ స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్రలో సీట్ల కేటాయింపుపై సమాజ్‌వాదీ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  
ఈ తరుణంలో విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మమతా బెనర్జీ, నీతీశ్‌కుమార్‌, సీతారాం ఏచూరి తదితర ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు ఖర్గే వెల్లడించారు. అంతా కలిసికట్టుగా ఉంటేనే భాజపాను ఓడించడం సాధ్యమన్న విషయాన్ని వారికి గుర్తు చేసినట్లు చెప్పారు. ఇండియా కూటమి బాగా పని చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునేవారు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరని భావిస్తున్నట్లు తెలిపారు.