భీమ్లా నాయక్ మూవీ రివ్యూ..,!!

సినిమా – భీమ్లా నాయక్ నటీనటులు – పవన్ కల్యాణ్, రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, మురళీశర్మ, రావు రమేష్, తదితరులు

సంగీతం – తమన్ సినిమాటోగ్రఫీ – రవి కె. చంద్రన్ ఎడిటింగ్ – నవీన్ నూలి స్క్రీన్ ప్లే, మాటలు – త్రివిక్రమ్ నిర్మాత – సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం – సాగర్ కె.చంద్ర విడుదల – 25.02.2022 కథ భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) కర్నూల్ జిల్లా హఠకేశ్వర్ మండలం స్టేషన్లో సబ్ ఇన్ స్పెక్టర్. నిజాయతీ గల పోలీస్ అధికారి. డానియల్ శేఖర్ (దగ్గుబాటి రానా) ఆర్మీలో పనిచేసి రిటైర్ అవుతాడు. అతను రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒక రోజు రాత్రి డానియల్ శేఖర్ కారులో మద్యం సీసాలతో అడవిగుండా వెళ్తూ అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కుతాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడే డ్యూటీలో ఉన్న భీమ్లా నాయక్.. డానియల్ ను కొట్టి స్టేషన్ కు తీసుకెళ్తాడు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో డానియల్ శేఖర్ అహం దెబ్బతింటుంది. భీమ్లా నాయక్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావిస్తాడు…
మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న పవన్ కల్యాణ్ వంటి నటుడిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలియనిది కాదు. ఆ విషయంలో మాత్రం భీమ్లా టీమ్ విజయం సాధించిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ నుంచి అభిమానులు ఏమి ఆశిస్తారో.. అవన్నీ మేళవించి సినిమాను తీర్చిదిద్దారు. త్రివిక్రమ్ రాసిన డైలాగులు ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేశాయి. భీమ్లా నాయక్ చెప్పే డైలాగులు అభిమానుల చేత సీటీలు వేయించాయి. ఇంటర్వెల్ ముందు ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్లు అభిమానుల్ని మరింత మెప్పిస్తాయి.

సెకండాఫ్ లో ఒరిజినల్ కంటెంట్ కన్నా.. మరిన్ని హంగులు జోడించి.. పవన్ మాస్ ఫాలోయింగ్ కు అనుగుణంగా సన్నివేశాలను చిత్రీకరించారు. భీమ్లా నాయక్ ఉద్యోగం పోవడానికి కారణమైన డానియల్ శేఖర్ తో భీమ్లా నాయక్ చేసే పోరాట సన్నివేశాలు మరింత ఉత్కంఠగా ఉంటాయి. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ అందరినీ మెప్పిస్తుంది. బలమైన ఎమోషన్ తో సినిమా ముగిసే విధానం బాగుంటుంది. ఈ సినిమా టైటిల్ ను చూసి పవన్ కల్యాణ్ పాత్రను మాత్రమే ఎలివేట్ చేస్తారనుకున్నారు కానీ.. మాతృకలో మాదిరిగానే రానా పాత్రకు న్యాయం చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే అందించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం..