దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్…

Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్..

*గుజరాత్‌* బిపోర్‌ జాయ్‌ తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. అరేబియా సముద్రంలో చురుగ్గా కదులుతూ దూసుకువస్తోంది.

ఈ నెల 15వ మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో బిపోర్‌ జాయ్‌ తీవ్ర తుఫాన్‌గా ఉంటుందని.. గంటలకు 150 కి.మీ వేగంలో గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ, జునాఘర్, రాజ్‌కోట్‌లతోపాటు పలు జిల్లాలపై బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అధికారులను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అప్రమత్తం చేసింది. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. బుధవారం ఆరెంజ్ అలర్ట్, జూన్ 15న రెడ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సముంద్ర తీరప్రాంతానికి దగ్గరగా వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. వారందరనీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చేపల వేటను ఇప్పటికే నిషేధించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెడీ అయ్యాయి..