గోల్కొండపై భాజపా జెండా ఎగరేస్తాం: బండి సంజయ్..

*గోల్కొండపై భాజపా జెండా ఎగరేస్తాం: బండి*

గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర భాజపా మొదటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భాజపా కార్యకర్తలు చేసిన సేవలు చాలా గొప్పవన్నారు. కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు భాజపా కార్యకర్తలు కరోనాతో మరణించారని తెలిపారు.
కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవాస్తవాలను ప్రచారం చేశారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. పారాసిట్మల్‌ టాబ్లెట్లు అంటూ అయోమయానికి గురి చేశారన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను తెరాస.. పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్లెక్లీలపై ప్రధాని ఫొటో లేకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కు పోయే దారిలో ఉన్న భారత్‌ బయోటెక్‌పై సీఎంకు కనీస అవగాహన లేదని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చినా.. తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకూ దీనిపై సానుకూలంగా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని చులకనగా చూశారని ఆరోపించారు. దీంతో అనేక మంది పేద ప్రజలు ప్రైవేటు వైద్యం చేయించుకోలేక చనిపోయారని, మరి కొందరు అప్పులపాలై రోడ్డున పడ్డారని పేర్కొన్నారు..