ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి..

ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి.

కేంద్రప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ నిర్వహించిన రోజ్‌గార్‌మేళాకు ఆయన హాజరయ్యారు. 9 జాతీయ బ్యాంక్‌లు, డీఆర్‌డీవో, ఇండియన్ రైల్వే, డిఫెన్స్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహా మొత్తం 22 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 470 మందికి కేంద్ర మంత్రి నియమాక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ మంత్రివర్గం సమావేశం నిర్వహించి అన్ని శాఖల ఖాళీలను గుర్తించాలని కోరారు. ఖాళీల లెక్కలన్నీ తీయగా దాదాపు 10 లక్షల పోస్టులు ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలిపారు. 10 లక్షల ఖాళీలను ఏకకాలంలో రిక్రూట్‌చేయడం సాధ్యం కాదని మోడీ నెలకు 70 వేల చొప్పున భర్తీ చేస్తున్నారు.

ఈమేరకు రోజ్‌గార్ మేళా నిర్వహిస్తూ స్వయంగా ప్రధాని ఉద్యోగార్థులతో మాట్లాడుతున్నారని తెలిపారు. 22 అక్టోబర్ 2022 దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహించే 6వ రోజ్‌గార్ మేళా కాగా నేటితో కలుపుకుని 4 లక్షల 30 వేలకు పైగా మంది యువకులకు అపాయింట్‌మెంట్ పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారని తెలిపారు. యూత్ పాపులేషన్‌లో భారతదేశం నెంబర్ వన్.. అనేక అంతర్జాతీయ, సాఫ్ట్‌వేర్ సంస్థలకు సీఈవోలు భారతీయులు ఉన్నారని, యువత మేధస్సు ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేలా భారత్ తయారు కానుందన్నారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని.. వారు ఉపాధి కోసం వెతికే స్థితి నుంచి ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

2047 నాటికి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తవుతుంది. అప్పటి వరకు మన యువత వారి శక్తి యుక్తులను ఉపయోగించి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగ్రామిగా నిలబెట్టాలని సూచించారు. భారత్ నేడు ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతో దేశంలో మొత్తం వాణిజ్య ఎగుమతులు 2021—22లో 418 బిలియన్ డాలర్లు వచ్చిందన్నారు.

నెలకు దాదాపు 35 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు గతేడాదిలో నమోదయ్యాయి. ఇవి కాకుండా సేవల ఎగుమతుల దాదాపు 250 బిలియన్ డాలర్లకు పైగానే నమోదైనట్లు చెప్పారు. ఇవన్నీ కేంద్రం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలుంటే ప్రస్తుతం 150కి చేరాయని, 2025 నాటికి 225 విమానాశ్రయాలు సిద్ధం చేసే దిశగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాలు వచ్చిన వారు అంకితభావంతో దేశం కోసం పని చేయాలని, పెంచిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని సూచించారు.